Mar 02,2023 23:55

ఏర్పాట్లు పరిశీలిస్తున మంత్రి అమర్‌్‌నాథ్‌

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో, ఎంవిపి.కాలనీ : సుమారు రూ.2 లక్షల కోట్లు పెట్టుబడులు, పెద్ద సంఖ్యలో యువతకు ఉద్యోగావకాశాలు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3, 4 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు విశాఖ సర్వం సిద్ధమైంది. ఇప్పటికే సమ్మిట్‌ జరిగే ఎయు ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు తరలిరానుండటంతో ఎయు ప్రాంగణమంతా పోలీసు వలయంలోకి వెళ్లిపోయింది. ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ వైపు పలువురు ఆసక్తిగా చూస్తున్నారు. కనీసం రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంతో మొదలుపెట్టి గౌరవప్రదమైన సంఖ్యతో ముగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భావిస్తున్నారు. సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఎం జగన్‌, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో ఉన్న వనరులను తెలియజేశారు. విశాఖ నగరానికి ఉన్న ప్రత్యేకతలను వారికి కళ్ళకు కట్టినట్టు చూపించారు. భావితరాలకు విశాఖ భవిష్యత్తు అన్న సంకేతమిచ్చారు. మరోపక్క మంత్రి అమర్‌నాథ్‌ ఢిల్లీ, ముంబయి, చెన్నరు, హైదరాబాద్‌, బెంగళూరు తదితర నగరాలలో రోడ్‌షోలు నిర్వహించారు. పరిశ్రమలకు ఏయే ప్రాంతాలు అనువైనవో తెలియజెప్పి వారందరినీ రాష్ట్రానికి ఆహ్వానించారు. పెట్టుబడులు పెట్టడానికి మెరుగైన అవకాశాలు ఉన్న 14 రంగాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పారిశ్రామిక దిగ్గజాలైన ముకేశ్‌ అంబానీ, కరణ్‌ అదానీ, కుమార మంగళం బిర్లా, గ్రంధి మల్లికార్జున రావు తదితరులు సదస్సుకు తరలివస్తున్నారు. ఈ సదస్సు జరిగే రెండు రోజులూ వివిధ పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఒయులు కుదుర్చుకోనుంది. ఇదిలా ఉండగా ఈ సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గురువారం సాయంత్రానికే విశాఖ నగరానికి చేరుకున్నారు. ఆయన సమ్మిట్‌ ముగిసే వరకూ ఇక్కడే ఉండనున్నారు.
ఏర్పాట్లు ఇలా..
ఎయు ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. మిరమిట్లు గొలిపే సభా వేదికపై సుమారు 30 మంది అతిథులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదిక వద్ద నాలుగు వేల మంది ప్రతినిధులు కూర్చునేందుకు అవకాశం కల్పించారు. సభ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో పనిచేస్తున్న పరిశ్రమలు, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు ఉన్న ప్రాంతాలు, అక్కడ మౌలిక సదుపాయాలను అతిథులకు తెలియజేసే విధంగా ఒక ఆడియో విజువల్‌ షోను ప్రదర్శించనున్నారు. ఈ సభా ప్రాంగణాన్ని పక్కనే ఉన్న మరో గదిలో బ్రేకౌట్‌ సెషన్స్‌ నిర్వహించనున్నారు. దాని పక్కనే మీడియా సెంటర్‌ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో సిఎం ఆఫీసును ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనికి అనుకుని మంత్రుల డైనింగ్‌ హాల్‌ ఏర్పాటు చేశారు. దాని పక్కనే మీడియా ప్రతినిధులకు డైనింగ్‌ సౌకర్యం కల్పించారు.
ఆకర్షణీయంగా ఎపి పెవిలియన్‌ స్టాల్స్‌
సభా ప్రాంగణంలో అత్యంత ఆకర్షణీయంగా ఎపి పెవిలియన్‌ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. దీని చుట్టూ వివిధ కంపెనీలకు చెందిన స్టాల్స్‌ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ కార్యాలయ నమూనా కూడా ఇక్కడ అందరినీ ఆకట్టుకోనుంది. లేపాక్షి హస్త కళా ప్రదర్శన స్టాల్‌ అందరినీ కట్టిపడేసే విధంగా ఉంది. కర్ణాటక సంప్రదాయ రీతులలో ఉన్న వివిధ ఆకృతులను స్టాల్స్‌ మధ్యలో ఏర్పాటు చేశారు.
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
విఐపిలు, వివిఐపిలు ఈ సభకు తరలివస్తున్న నేపథ్యంలో పోలీసులు నగరమంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. సభా ప్రదేశాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సిసి కెమెరాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. అలాగే డ్రోన్‌ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు.
సిఎంకు ఘన స్వాగతం
సమ్మిట్‌లో పాల్గొనేందుకు సిఎం జగన్మోహన్‌ రెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 5:15 నిమిషాలకు విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్‌నాథ్‌, విజయసాయిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌ పోర్టు నుంచి బయలుదేరిన సిఎం కాన్వారుకు తాటిచెట్లపాలెం వద్ద వైసిపి ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకె.రాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది అనంతరం సిఎం తాను బస చేసే రాడిసన్‌ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 8:50కి బయలుదేరి 9:10కి సమ్మిట్‌ వేదిక వద్దకు చేరుకోనున్నారు.