Aug 15,2023 00:15

పోర్టు ఆసుపత్రి వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు

ప్రజాశక్తి -మాధవధార : లాభాల్లో ఉన్న విశాఖపట్నం పోర్టును ప్రయివేటీకరించొద్దని యునైటెడ్‌ పోర్టు డాక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, విడిఎల్‌బి యూనియన్‌ ఆధ్వర్యాన సోమవారం పోర్టు హాస్పిటల్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు యూనియన్ల కార్యదర్శులు కె.సత్యనారాయణ, బి.లక్ష్మణరావు మాట్లాడుతూ, భారతదేశంలో 11 పోర్టులు ఉన్నాయని, వాటిలో విశాఖపట్నం లాభాల్లో నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. లాభాల్లో ఉన్న పోర్టును కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు కారుచౌకగా కట్టబెట్టడానికి సన్నాహాలు చేస్తోందని విమర్శించారు. పోర్టు ఆస్పత్రిలో సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల కార్మికులకు వైద్య సదుపాయాలు సక్రమంగా అందడంలేదన్నారు. తక్షణమే నియామకాలు చేపట్టాలని, పోర్టు ఆస్పత్రి ప్రయివేటీకరణ ఆలోచనను విరమించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎ.స్వతంత్రకుమార్‌, కార్మికులు పాల్గొన్నారు.