Jun 15,2021 06:54

   చింతపల్లి, పాడేరు, అరకు లాంటి ప్రధాన కేంద్రాల్లో కూడా వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. సరిపడా నర్సింగ్‌ సిబ్బంది కూడా లేరు. ఇక మిగిలిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కువ మంది ప్రజలు సరైన వైద్యం అందకే మరణించారు. పాడేరు, అరకు ఆసుపత్రులలో వెంటిలేటర్లు ఉన్నా, వాటికి వాడగలిగే సిబ్బంది లేక అవి మూలన పడి ఉన్నాయి. అవసరమైన వైద్య పరీక్షలు చేసే ల్యాబ్‌ లు లేవు. అనేక మంది ప్రజలు రవాణా సదుపాయాలు లేక వ్యాధి సోకినా ఆసుపత్రులకు రాలేక ఇళ్ల వద్దే మరణిస్తున్నారు.
   కరోనా రెండవ వేవ్‌ విశాఖ జిల్లా గిరిజన ప్రాంతాన్ని చుట్టుముట్టేసింది. గ్రామగ్రామాన విస్తృతంగా వ్యాపించింది. ప్రభుత్వం మొదటి సారి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో గిరిజన ప్రాంతాన్ని ఈ మహమ్మారి పెద్దగా తాకలేదు. కానీ రెండోసారి ప్రజలను గాలికొదిలేయడంతో అప్పటి దాకా ప్రశాంతంగా ఉన్న గిరిజన గ్రామాలను ఈ వ్యాధి ఊపేస్తోంది. ఇప్పటి వరకు 84 మంది చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కలున్నాయి. కానీ వంద మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులే మృతి చెందారు. ఇవి కాకుండా ప్రతి మండలంలో సాధారణ ప్రజలు 50కి పైగా మరణించారు.
   ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో గిరిజనులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రమయిన అరుకు మండల కేంద్ర ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ బెడ్లు 40 ఉండగా, కేవలం ముగ్గురే డాక్టర్లు ఉన్నారు. కరోనా కేసులు వందలో సంఖ్యలో వస్తున్నాయి. తగినంత సిబ్బంది లేకపోవడంతో పేషెంట్లను వైజాగ్‌ రిఫర్‌ చేసేస్తున్నారు. కరోనా టెస్టులు, గరిష్టంగా రోజుకు 30 మాత్రమే చేస్తున్నారు.
   అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బెడ్లు లేక ఇంటి వద్దే ఐసొలేషన్‌ లో ఉండమని కిట్లు ఇచ్చి ఇళ్లకు పంపించేస్తున్నారు. గిరిజన గుడిశలలో ఒక్క గది మాత్రమే ఉంటుంది. కుటుంబమంతా ఆ గదిలోనే ఉండాలి. అందువల్ల ఐసొలేషన్‌ సాధ్యం కాదు. వ్యాధిని గుర్తించడంలో ఏమాత్రం ఆలస్యమ యినా కుటుంబమంతా ఈ వ్యాధి బారిన పడుతు న్నారు. దీనికి తోడు కూలీ పనులకు కూడా వెళ్లలే కపోవడంతో ఆహారం పెద్ద సమస్యగా మారింది.
    మీకండగా మేమున్నాం అని శారదా ట్రస్టు, అల్లూరి విజ్ఞాన కేంద్రం, గిరిజన సంఘం ముందుకొచ్చాయి. అరకులోయ శారదా నికేతన్‌ స్కూల్‌లో 30 పడకల ఉచిత ఐసొలేషన్‌ కేంద్రాన్ని మే నెల 11న ప్రారంభించారు. అనుభవజ్ఞులైన ముగ్గురు వైద్యాధికారులు, నర్సింగ్‌ సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో ఈ కేంద్రం నిరంతరం సాగుతోంది. రోగులకు అవసరమైన పరీక్షలు చేస్తున్నారు. పది మంది వాలంటీర్లు నిరంతరం సేవలందిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు నాణ్యమైన పౌష్టికాహారం అక్కడే వండి అందిస్తున్నారు. ఉదయం 6 గంటలకు నిమ్మరసం- వేడి నీళ్ళు, 8 గంటలకు టిఫిన్‌, 10 గంటలకు రాగిజావ-కోడి గుడ్డు, మధ్యాహ్నం 12.30 గంటలకు ఆకుకూర పప్పు-మరో కూర, పెరుగన్నం, సాయంత్రం 4 గంటలకు పళ్ళు- ఫలహారం, రాత్రి 7 గంటలకు భోజనం, ఆదివారం, బుధవారం మాంసాహారం మెనూగా ఉంటోంది.
    కోవిడ్‌ బాధితులు ఈ సెంటరుకు చేరుకో వడమే పెద్ద సమస్య. దీనిని గమనంలో ఉంచుకుని, గ్రామాల నుండి వీరిని తీసుకురావడానికి, అవసర మైతే ఆసుపత్రికి తరలించడానికి వీలుగా ఆక్సిజ న్‌తో కూడిన రెండు అంబులెన్సులను అందుబాటు లోకి తీసుకురావడం జరిగింది. 24 గంటల్లో ఏ సమయంలో ఫోన్‌ చేసినా అంబులెన్సు వారి ఇంటికి వెళ్ళి పేషెంట్లను తీసుకువస్తోంది. రోగిని తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుస్తోంది.
   ఈ సెంటరు నిర్వహణలో స్థానిక ప్రభుత్వ అధికారులు మంచి సహకారం అందిస్తున్నారు. వర్తక సంఘం వారు నిరంతరం నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్థిక సహకారం అందించారు. చార్జింగ్‌ లైట్లు, టి.వి వంటివి కూడా ఏవి అవసరం అయితే అవి క్షణంలో అందించారు. గిరిజన ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘం, యుటిఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, సిఐటియు నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు సేవలందిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు, అంగన్‌వాడీ, టూరిజం, మోటార్‌ కార్మికులు ఇలా అన్నిరంగాల నుండి అనేక విధాలుగా సహకారం లభిస్తోంది.
   ఏజన్సీ 11 మండలాలలో కోవిడ్‌ పై తీసుకోవలసిన జాగ్రత్తలపై గిరిజన సంఘం గ్రామ గ్రామాన తిరిగి విస్తృతంగా ప్రచారం చేసింది. 20 వేల కరపత్రాలను ముద్రించి, పంచింది. అరకు వ్యాలీ మండలంలో అన్ని గ్రామాలలో ఆటో ద్వారా ప్రచారం చేసింది. ఉపాధి హామీ పనులు జరిగే చోట్ల గ్రూప్‌ మీటింగుల ద్వారా చైతన్యం చేశారు. ఈ ప్రచారం సందర్భంలోనే కరోనా లక్షణాలున్న వారికి టెస్టులు చేయించడం, ఐసొలేషన్‌ సెంటరుకు తరలించడం కూడా చేస్తున్నారు.
   ఏజన్సీ ప్రాంతంలో ప్రభుత్వ వైద్య సదుపాయాల డొల్లతనం ఈ సందర్భంగా మరోసారి బహిర్గతమయింది. కరోనా రోగులకు వైద్యం అందించడంలో ఒక రకంగా చేతులెత్తేశారని చెప్పాలి. చింతపల్లి, పాడేరు, అరకు లాంటి ప్రధాన కేంద్రాల్లో కూడా వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. సరిపడా నర్సింగ్‌ సిబ్బంది కూడా లేరు. ఇక మిగిలిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కువ మంది ప్రజలు సరైన వైద్యం అందకే మరణించారు. పాడేరు, అరకు ఆసుపత్రులలో వెంటిలేటర్లు ఉన్నా, వాటికి వాడగలిగే సిబ్బంది లేక అవి మూలన పడి ఉన్నాయి. అవసరమైన వైద్య పరీక్షలు చేసే ల్యాబ్‌ లు లేవు. అనేక మంది ప్రజలు రవాణా సదుపాయాలు లేక వ్యాధి సోకినా ఆసుపత్రులకు రాలేక ఇళ్ల వద్దే మరణిస్తున్నారు. పెదబయలు మండలంలో రెండు వారాలలో ఇలా 14 మంది చనిపోయారు. ఇలాంటివి ప్రభుత్వ లెక్కల్లో కోవిడ్‌ మరణాల కిందకు రావు. జ్వరం వస్తే అది ఏ జ్వరమో కూడా తెలియకుండా మరణిస్తున్న వారూ ఉన్నారు. ఇటీవల వైద్య ఆరోగ్య సిబ్బంది చేసిన ఫీవర్‌ సర్వే సందర్భంగా విశాఖ ఏజన్సీ 11 మండలాలలో నాలుగు వేల మంది జ్వరంతో బాధపడుతున్నారని వారి రిపోర్టులలో తేలింది. వాస్తవ లెక్కలు ఇంకా అధికంగానే ఉంటాయి. అరకు వ్యాలీ మండలం పెదలబుడు పంచాయతీలో నువ్వగుడ గ్రామంలో 25 కుటుంబాలుంటే వారిలో 18 కుటుంబాలకు కరోనా సోకింది. ఏజన్సీలో విస్తరిస్తున్న వ్యాధి తీవ్రతకు ఇది అద్దం పడుతోంది.
   ఇప్పటికయినా ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో రోడ్లు, రవాణా సౌకర్యాలు పెంచాలి. ఆసుపత్రులలో వైద్యులను, నర్సులను, ఇతర సిబ్బందిని సరిపడా నియమించాలి. మందులు, ల్యాబ్‌ సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి.
   గిరిజన ప్రాంతంలో కోవిడ్‌ లాంటి మహమ్మారి నుండి ప్రజలను రక్షించాలంటే ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించిన విధంగా గ్రామ క్లినిక్‌ లు ఏర్పాటు చేసి సచివాలయాల ద్వారా మెరుగైన వైద్యం అందించాలి. కోవిడ్‌ టెస్టు చేసి, పాజిటివ్‌ వచ్చిన వారికి సచివాలయం కేంద్రంగా ఐసొలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, డాక్టర్‌ నిరంతర పర్యవేక్షణతో పాటు పౌష్టికాహారం అందించాలి. సచివాలయం కేంద్రంగా ఉచిత టీకా అందరికీ వెంటనే అందించాలి. ఇలా చేయడం ద్వారానే కోవిడ్‌ నుండి గిరిజన ప్రజలకు కాపాడడం సాధ్యం.
 

/ వ్యాసకర్త సిఐటియు విశాఖ జిల్లా కార్యదర్శి /
వి. ఉమామహేశ్వరరావు

వి. ఉమామహేశ్వరరావు