ప్రజాశక్తి - తాళ్లరేవు వారంతా పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని సజ్జాపురం గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబాలకు చెందిన స్నేహితులు. సరదాగా గడుపుదామని పుదుచ్చేరిలోని యానాం వచ్చారు. అక్కడి నుంచి గోదావరి ప్రాంతాన్ని తిలకించాలని లంక గ్రామాల్లోని గోపులంక పుష్కర ఘాట్‌కు చేరుకున్నారు. ఆ పుష్కర ఘాట్ వారి పాలిట విషాదాంతమైంది. పుష్కర ఘాట్‌లో ఏడుగురు యువకులు స్నానానికి దిగారు. ముగ్గురు యువకులు గోదావరి ఒడ్డున లోతులో స్నానం చేస్తుండగా ఒక యువకుడు పుష్కర ఘాట్ మెట్ల పైనుంచి వేగంగా నదిలోకి దూకాడు. ఆ యువకుడికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతుండగా అతడిని రక్షించడానికి తోటి స్నేహితులు ముగ్గురూ లోతులోకి వెళ్లారు. వీరు మునిగిపోతున్న పరిస్థితిని గమనించి ఒడ్డు దగ్గరలో స్నానం చేస్తున్న మరో ముగ్గురు యువకులు పక్కనే ఉన్న కొబ్బరి మట్టల సహాయంతో వారిని రక్షించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే వారి కళ్ళముందే గోదావరి ఒడిలో ఆ నలుగురు యువకులు గల్లంతయ్యారు. దిక్కుతోచని స్థితిలో అదే కొబ్బరి మట్టలు పట్టుకుని ఆ యువకులు గోదావరి ఒడ్డుకు చేరుకున్నారు. స్నానానికి దిగిన యువకుల్లో తిరుమల రవితేజ, పెండ్యాల బాలాజీ, ముద్దన ఫణీంద్ర గణేష్, అనుమకొండ కార్తీక్ గల్లంతయ్యారు. ఒడ్డుకు చేరిన సలాది దుర్గా మహేష్, కొమ్మిరెడ్డి చైతన్య తమ స్నేహితుల కోసం విలవిల్లాడుతున్నారు. మరో స్నేహితుడు నేదూరి భాను భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను ఇంటికి చేరాడో లేదో ఇంకా తెలియదు. స్నేహితులు ఫోన్ చేస్తుంటే ఫోను లిఫ్ట్ చేయడం లేదని కొమిరెడ్డి చైతన్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తిరుమల రవితేజ తండ్రి 2016లో అకాల మరణం చెందారు. తల్లి టీ షాపు నిర్వహిస్తూ కుమారుని ఉన్నత చదువులు చదివిస్తోంది. పెండ్యాల బాలాజీ తల్లి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుని. ముద్దన ఫణీంద్ర గణేష్ తండ్రి దుబాయిలో ఉపాధి కోసం వెళ్లారు. అనుమకొండ కార్తీక్ సోనోవిజన్ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. సంఘటన జరిగిన వెంటనే గోపులంక గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన యువకులు తమ గ్రామంలో గల్లంతు కావడంలో వారు విషాదంలో మునిగిపోయారు. గోపులంక పుష్కర ఘాట్‌కు సమీపంలో గ్రోయిన్స్ ఏర్పాటు చేయడం వల్ల ఆ గ్రోయిన్స్‌ను తాకిన గోదావరి ఒడి ప్రభావంతో పుష్కర ఘాట్‌లో లోతు ఏర్పడిందని, పది మీటర్లు దాటితే అంతా మెరకే అని, వచ్చిన యువకులంతా స్థానికేతరులు కావడంతో వారికి పుష్కర ఘాట్ గురించి తెలియకపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని వాపోతున్నారు. రెవెన్యూ, పోలీసు అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి కావడంతో రాత్రివేళ గాలింపు చర్యలు నిలిపివేశారు. మళ్లీ తిరిగి ఉదయం గాలింపు చర్యలు చేపడతామని కాకినాడ రూరల్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. సంఘటన స్థలానికి డిఎస్‌పి మురళీకృష్ణారెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.










