Aug 16,2023 22:15

కుమారుని మృతదేహం వద్ద రోదిస్తున్న ఆనంద్‌

* పుట్టినరోజు వేడుకలకు వచ్చి మృత్యువాత
* నాగావళిలో స్నానం చేస్తూ ఇద్దరు బాలురు మృతి
* కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
శ్రీకాకుళం నగరం పెద్ద రెల్లివీధిలో విషాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. తన కళ్లెదుటే ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో ఆ తండ్రి విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కొద్ది గంటల వరకు ఆడుతూ పాడుతూ కనిపించిన చిన్నారులు అంతలోనే విగతజీవులుగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తల్లి జ్యోతి విలపిస్తున్న తీరు చూసిన వారికి దు:ఖం తెప్పిస్తోంది. దీంతో పెద్దరెల్లివీధి ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
పెద్ద రెల్లివీధి సమీపంలో నాగావళి నదిలో స్నానానికి వెళ్ళి ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో కార్తికేయ (11), గణేష్‌ గౌతమ్‌ (7) ఉన్నారు. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం విశాఖపట్నం ఎన్‌ఎడి జంక్షన్‌ ఉంటున్న కోన గణేష్‌ భార్య జ్యోతి, తన ఇద్దరు కుమారులతో కలిసి తన చిన్న మరదలు కూతురు జెస్సికా పుట్టినరోజు వేడుకలకు మూడు రోజుల కిందట శ్రీకాకుళం వచ్చారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆనంద్‌ తన ఇద్దరు పిల్లలతో పాటు తన ఇద్దరు మరదళ్ల పిల్లలు వర్షిత్‌, సంపత్‌తో కలిసి స్నానానికి వెళ్లారు. ఐదుగురూ నదిలోకి దిగి స్నానం చేస్తున్న క్రమంలో నలుగురూ నీటిలో ఆడుకుంటూ లోతు ఎక్కువ ఉన్న ప్రాంతంలోకి వెళ్లి మునిగిపోయారు. వీరిలో సంపత్‌కు ఈత రావడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. పిల్లలు మునిగిపోతుండడం చూసి ఆనంద్‌ ముగ్గురినీ రక్షించే ప్రయత్నం చేశారు. వారిలో సంపత్‌ను రక్షించగలిగాడు. తన ఇద్దరు కుమారులను కాపాడలేకపోయాడు. స్థానికులను పిలిచి మునిగిపోయిన చిన్నారులను రక్షించే ప్రయత్నం చేశారు. చిన్న కుమారుడు గణేష్‌ గౌతమ్‌ దొరకగా బయటకు తీశారు. కొనఊపిరితో ఉన్న బాలుడిని నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు చెప్పారు. కొద్దిసేపటి తర్వాత కార్తికేయ కొన ఊపిరితో దొరకడంతో ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అయినా ప్రాణం దక్కలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.