Nov 13,2023 23:01

ఆసుపత్రి వద్ద ఘటనపై ఆరా తీస్తున్న ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి

పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకున్న భర్త
అడ్డుకున్న భార్య, పెద్ద కుమారుడు
ఘటనలో భార్య, భర్తలు మృతి, కుమారుని పరిస్థితి విషమం
ప్రజాశక్తి -కొత్తపేట
చిన్నపాటి వివాదం ఆ ఇంట విషాదాన్ని నింపింది. పండుగపూటా సరతోషంగా ఉన్న ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. మండలంలోని అవిడి గ్రామం కట్లమ్మ కాలనీలో పెదపూడి ఆదినారాయణ కుటుంబం నివాసం ఉంటుంది. ఆదివారం దిపావళి నేపథ్యంలో బాణసంచా కొనుగోలు కోసం భార్య మంగాదేవిని ఆదినారాయణ రూ.2వేలు అడిగాడు. ఈ విషయంలో వారిపై వాగ్వాదం నెలకొంది. డబ్బులు ఇవ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆదినారాయణ అమ్మేందుకు తెచ్చిన పెట్రోల్‌ను శరీరంపై పోసుకున్నాడు. వెంటనే భార్య మంగాదేవి, పెద్దకొడుకు దుర్గాప్రసాద్‌ వచ్చి అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అగ్గిపుల్ల వెలిగించడంతో ముగ్గురినీ మంటలు చుట్టుముట్టాయి. ఇది చూసిన చిన్నకుమారుడు నాగరాజు కేకలు వేస్తూ వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల స్థానికులు చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో మంగాదేవి(35) అక్కడికక్కడే సజీవ దహనమైంది. ఆదినారాయణ, దుర్గప్రసాద్‌ తీవ్రంగా గాయపడ్డారు. నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్‌లో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్ర వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదినారాయణ మృతి చెందాడు. దుర్గాప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కొత్తపేట ఎస్‌ఐ మణికుమార్‌ తెలిపారు. ఘటనా స్థలాన్ని కొత్తపేట డిఎస్‌పి కెవి.రమణ, రావుల పాలెం సిఐ రజనీకుమార్‌ పరిశీలించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
పలువురు పరామర్శ
విషయం తెలుసుకున్న ఎంఎల్‌ఎ చిర్ల జగ్గిరెడ్డి, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు వేరువేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మతదేహాలను పరిశీలించారు. గాయాల పాలైన వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించేలా అక్కడి డాక్టర్లతో మాట్లాడారు.