Jan 04,2023 23:57

బాలింతతో మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ జమిల్‌బాషా

ప్రజాశక్తి మారేడుమిల్లి
మలేరియా, డయేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జమిల్‌ బాషా వైద్యాధికారులను ఆదేశించారు. మండలంలోని బోదులూరు పిహెచ్‌సి, గిరిజన ఆశ్రమ హైస్కూల్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఆశ్రమ హైస్కూల్‌లో బాలికలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. విద్యార్ధినులకు పౌష్టికాహారం, పరిసరాల పరిశుభ్రత, రక్తహీనత నివారణ, తీసుకోవలసిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత వంటి వాటిపై అవగాహన కల్పించారు. నులిపురుగుల నివారణకు తప్పనిసరిగా ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్‌ మాత్రను అందించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. బోదులూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, వైద్య సేవల గూర్చి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోదులూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి సందర్శించి అన్ని వార్డులను, రికార్డులను తనిఖీ చేశారు. మందులను పరిశీలించారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. కోవిడ్‌ నాలుగో వేవ్‌ కారణంగా కోవిడ్‌ టెస్టులను పిహెచ్‌సిలలో అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు. మాతృ, శిశు మరణాల నివారణకై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి వైద్యాధికారులు, స్కూల్‌ ఉపాధ్యాయులు, జిల్లా టిబి పర్యవేక్షకులు వి కిరణ్‌, పిహెచ్‌సి సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.