నిమ్మనపల్లి : విష జ్వరాలపై వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ అన్నారు. బుధవారం నిమ్మనపల్లి మండలంలో సబ్‌యూనిట్ అధికారి ఖలీల్, సూపర్వైజర్ దేవేంద్రలతో కలసి పర్యటించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ బాబును ఫీవర్ సర్వే, పరిసరాల పరిశుభ్రత, లార్వా నియంత్రణ, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాల నిర్వహణ పై ఆరా తీశారు. అనంతరం బండ్లపై గ్రామంలో వైద్యాధికారి ఆధ్వర్యంలో దోమల నివారణ, లార్వా నివారణ కోసం జరుగుతున్న అబేట్ పిచికారి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమలు ప్రబలకుండా, మలేరియా, టైఫాయిడ్, వైరల్ వంటి జ్వరాలు బారిన పడకుండా ప్రజలు, వైద్య ఆరోగ్య సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇంటి చుట్టు ప్రక్కల పరిసరాలలో నీటిని ఒకే చోట ఎక్కువ రోజులు నిల్వ ఉంచరాదని, నీటి తొట్టెలు, బిందెలు, ఇతర పాత్రల పై మూత వేయాలని, నిరుపయోగంగా ఉన్న టైర్లు, వ్యర్ధ పదార్థాలను తొలగించాలని పేర్కొన్నారు. జ్వర లక్షణాలు కలిగిన వారు తక్షణం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకొని, తగు చికిత్సలు పొందాలని సూచించారు. జ్వరాలను నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది క్రమం తప్పకుండా ఫీవర్ సర్వేలను నిర్వహిస్తూ లక్షణాలు కలిగిన వారికి వైద్య పరీక్షలు చేసి, చికిత్సలు అందించాలన్నారు. కార్యక్రమంలో సబ్‌యూనిట్ అధికారి ఖలీల్, సూపర్వైజర్ దేవేంద్ర, ఎఎన్‌ఎంలు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.