ప్రకృతి అంటేనే విరివనాల సమాహారం. ఒక్కో కాలంలో.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా మొక్కలు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రసిద్ధి పొంది, మనకు తెలియని మొక్కలెన్నో ఈ జగత్తులో ఉన్నాయి. ఎన్నో విశిష్ట లక్షణాలతో మనల్ని అలరించే కొన్ని అపురూప పూల మొక్కల పరిచయం మీకోసం..
ప్రిటల్లారియా పూలమొక్క..
మొక్కల ప్రపంచంలో మరో అపురూపమైన పూలమొక్క 'ప్రిటల్లారియా'. దీని పువ్వు పసుపురంగు రేకలు, తెల్లని పుప్పొళ్ళు, మధ్యమధ్యలో పొడవాటి ఆకుపచ్చని ఆకులతో చూడటానికి భలే వింతగా ఉంటుంది. లీలియాసియే అనే లిల్లీ కుటుంబానికి చెందినది ఈ పూలమొక్క. దీన్ని కిరీటం పువ్వుల మొక్కలు అని కూడా అంటారు. మనదేశంలో హిమాలయ ప్రాంతాల్లో అలంకరణకి ఈ పువ్వులు వాడతారు.
కింగ్ ప్రోటీయా..
ఇది పెద్దపెద్ద పూలనిచ్చే మొక్క. దీని పూలు కాంతులు విరజిమ్ముతున్నట్లు ఉంటాయి. పువ్వు రేకలు, దళాలు, పుప్పొళ్ళు, కేసరాలు క్రమబద్ధమైన అమరికల్లో పలురకాల రంగుల మేళవింపుతో పువ్వును చూడగానే కనువిందు చేస్తాయి. వీటి ఆకులు గుండ్రంగా, మందంగా ఉండి, చివరన కాస్త ఎరుపు అంచులా ఉంటుంది. మొక్క రెండడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఇది ఆఫ్రికా దేశపు అడవి జాతిమొక్క. పెద్దగా నీటివనరు అవసరం లేదు. ఈ మొక్కని బయటి వాతావరణంలో పెంచుకోవచ్చు. ఇది కుండీల్లోనూ, నేల మీదా పెరుగుతుంది.
ఒర్బియా సెమోటా..
నక్షత్రాల్లాంటి తళుకు పువ్వులు పూసే అద్భుత మొక్క 'ఒర్బియా సెమోటా'. దీని పువ్వు ఐదు రేకలతో పద్మం మాదిరిగా మెత్తగా ఉంటుంది. పువ్వు చుట్టూ ఉండే తెల్లని కేశరాల్లాంటి ఈకలు మరింత అందాన్నిస్తాయి. లోపల లేత పసుపురంగు గుండ్రని ఉబ్బెత్తు భాగము ఉంటుంది. అందులో చిన్న నక్షత్రంలాంటి చింతపిక్క రంగు అమరికతో పువ్వు అచ్చంగా రాఖీలా చూడముచ్చటగా ఉంటుంది. శరద్ రుతువులో ఈ పువ్వులు ఎక్కువగా పూస్తాయి. ఐదడుగుల ఎత్తు వరకూ పెరిగే ఈ మొక్కకి వారానికి రెండుసార్లు నీళ్ళు పోస్తే చాలు. ఇసుక, రాతినేలల్లోనూ ఇది పెరుగుతుంది. దీనికి సూర్యరశ్మి ఎక్కువగా కావాలి. వీటి పువ్వులు ఈగలను ఎక్కువగా ఆకర్షిస్తాయి.
ఏబేనస్ క్రెటీకా..
ఇది ఏడాదంతా పుష్పించే పూలజాతి మొక్క. ఐదడుగుల వరకూ పెరుగుతుంది. రకరకాల రేకలు, పుప్పొళ్ళు, పత్ర దళాలతో పువ్వు పొడవుగా, గదుల వంటి నిర్మాణాలతో విభిన్నమైన రంగుల కలబోతతో ఆకట్టుకుంటుంది. ఏడాదంతా పువ్వులు పూసినప్పటికీ మార్చి నుంచి జూన్ చివరివరకూ పూత ఎక్కువగా ఉంటుంది. పూరేకల్లో మకరందం పొదిగి ఉండటంతో కీటకాలు నిత్యం ఈ మొక్కల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ పూలను ఐస్‌క్రీమ్, లాలీపాప్ అని కూడా పిలుస్తారు. ఇది పొదజాతి మొక్క. ఎర్రమట్టి నేలలో బాగా పెరుగుతుంది.
మచ్చల లిల్లీ..
ఈ మొక్క లిల్లీ కుటుంబానికి చెందిన జపానీ జాతి మొక్క. 'ట్రైసిర్టిస్హిర్తా' దీని శాస్త్రీయ నామం. పువ్వుల్లో దళాలు దళసరిగా కండ కలిగి, వివిధ ఆకృతుల్లో ఉంటాయి. విభిన్న రంగుల్లో మచ్చలు, చుక్కలు ఈ పూలకు ప్రత్యేక అందం. ఆకులు వెడల్పుగా, పొడవుగా ఉంటాయి. ఇది కుండీల్లోనూ బాగా పెరుగుతుంది.
అర్జెంటీనా పూలమొక్క..
ఆలస్త్రోమేరియా ఆరియా అనేది చిలీ, అర్జెంటీనా దేశాలకి చెందిన ఆలస్త్రో మేరియాసియేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క. ఇది ఫెరువిల్లియ లిల్లీ జాతికి చెందిన మొక్క. పసుపురంగు పూరేకలకు చివరన ఎర్రని మచ్చలు, మధ్యలో పసుపురంగు పుప్పొళ్ళు, చిన్నచిన్న ఆకులతో పువ్వు భలే గమ్మత్తుగా ఉంటుంది. వేసవి ఆరంభంలో మొగ్గ తొడుక్కుని, ఇవి పువ్వులుగా విచ్చుకుంటాయి. మూడడుగుల వరకూ పెరిగే ఈ మొక్కలను కుండీల్లోనూ, నేల మీదా పెంచుకోవచ్చు.
చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506