Mar 13,2022 15:15
  • సంగీతమంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు! అలసిన మనసులకు అదొక రిఫ్రెష్‌మెంట్‌! రిలాక్సేషన్‌ కోసం సంగీతం వినే వాళ్లు కొందరయితే, పాటే ప్రాణంగా భావించే వాళ్లు మరికొందరు. అసలు ఆ పాట ఎలా పుట్టింది? ఆహా.. ఏమి లిరిక్స్‌ అవి? రెండో చరణంలో ఆ భావం అదిరిపోయింది! ఇలా పాట లోతుల్లోకి వెళ్లి ఆలోచించే మ్యూజిక్‌ లవర్స్‌ చాలా మందే ఉంటారు. అయితే ఆ పాటనే ప్రాణంగా భావించి.. గాయకులుగా ఎదగాలనే లక్ష్యంగా ఎంచుకున్నవారు ఎందరో... ఇందుకోసం ఉన్నత విద్యను అభ్యసించిన ఉద్యోగ ప్రయత్నాలు వీడిన వారు కొందరైతే.. తమ ప్రతిభను చాటుకోవడం కోసం పోటీ ప్రపంచంలో ఎదురీదుతున్న వారు మరికొందరు.. వీరిలో చాలా మంది గురువులేని ఏకలవ్యుల్లా.. మట్టిలో మాణిక్యాలుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఆణిముత్యాలతోనే తెలుగువారికి ఎంతో ఇష్టమైన సింగింగ్‌ రియాలిటీ షో 'సరిగమప సింగింగ్‌ సూపర్‌ స్టార్స్‌' ఒక కొత్త సీజన్‌తో మన ముందుకి వచ్చేసింది.. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు ఈ వేదికను చేరుకునేందుకు ఎదుర్కొన్న పరిస్థితులపైనే ఈ ప్రత్యేక కథనం..

నిజమే.. సంగీతానికి అవధుల్లేవు. అది యూనివర్సల్‌. ప్రాంతం, భాషతో అసలే సంబంధం లేదు. ఎవరైనా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఎవరైనా సంగీత సాధన చేయొచ్చు. అయితే ఇది సక్సెస్‌ అయినవారికి మాత్రమే వర్తించేది. ప్రస్తుతం భాషతోనూ ప్రాంతంతోనూ సంబంధం లేకుండా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత కళాకారులు ఒకే వేదికపైకి చేరారు. సాధారణంగా తెలుగు మ్యూజిక్‌ షోస్‌లో ఒకే ప్రాంతం నుంచి వచ్చిన సంగీత కళాకారులే కనిపించేవారు.. ఈసారి జీ తెలుగు నిర్వహిస్తున్న 'సరిగమప సింగింగ్‌ సూపర్‌స్టార్స్‌లో వివిధ రాష్ట్రాల నుంచి, చివరికి అమెరికా నుంచీ ఓ కుర్రాడు కంటెస్టెంట్‌గా వచ్చాడు. మారుమూల పల్లెల నుంచి వచ్చిన వారూ ఈ వేదికపై అద్భుతంగా పాడటం వీక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఫిబ్రవరి 27న ప్రారంభమైన ఈ షోకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన వస్తుంది. అయితే ఈ షో ప్రారంభోత్సవం సందర్భంగా కంటెస్టెంట్స్‌ ఈ వేదికను చేరుకోవడానికి తాము ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. ఈ షో కోసం పదివేల మందికి ఆడిషన్స్‌ నిర్వహించగా.. 29 మంది మాత్రమే ఎంపికయ్యారు. వీరిలో ఎవరికి వారే ప్రత్యేకం.. ఒక్కో స్వరం ఒక్కో అద్భుతం..

  •  
  • విరిసిన... వసంత గానం....
  • ఆమె స్వరం.. ఊరికి వరం..

సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి ఉందంటారు. అది ఎంత వరకూ నిజమో తెలియదు కానీ.. సుదీర్ఘ కాలంగా రవాణా సదుపాయం లేని ఊరికి బస్సు వచ్చేలా మాత్రం చేసింది. మారుమూల పల్లెకు చెందిన ఓ యువతి ఈ ఘనత సాధించింది. తన పాటతో ఆకట్టుకోవడమే కాకుండా, గ్రామానికి మేలు చేసే కోరికను కోరి, అందరి హృదయాలనూ గెలుచుకుంది. ఆమే కర్నూలు జిల్లా, కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన దాసరి పార్వతి. తన కృషితో జీ - సరిగమపలో పాడే అవకాశం దక్కించుకుంది. ప్రతిభ ఉండాలే కానీ.. దానికి అందం, ఐశ్వర్యంతో సంబంధంలేదని నిరూపించింది. తన పాటతో అందరి మనసులూ గెలుచుకుంది. ఊరికి బస్సు సౌకర్యాన్ని రప్పించింది. దాసరి శ్రీనివాసులు, మీనాక్షమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. తమకున్న ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వీరి చిన్న కుమార్తె దాసరి పార్వతి. బాల్యం నుంచే పాటలు పాడడంపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో పాటలు పాడే విధానాన్ని గమనించి, ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. సాధన చేస్తే భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగొచ్చని చెప్పడంతో తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. ఇంటర్‌ పూర్తయ్యాక తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో చేర్పించారు. అక్కడ ప్రిన్సిపాల్‌ సుధాకర్‌, గురువు వల్లూరి సురేష్‌బాబు వద్ద శిక్షణ తీసుకుంటూ పార్వతి టీటీడీ ఛానల్‌ 'అదిగో అల్లదిగో' కార్యక్రమానికి ఎంపికయ్యారు. పలు పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు.
'ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి' అనే పాట పాడడంతో కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రశంసలు కురిపించారు. పార్వతిని ఏమి కావాలో కోరుకోమని అడగగా.. తాను పడ్డ కష్టాలు తమ గ్రామస్తులు పడకూడదని, తన గ్రామానికి బస్సు వేయాలని కోరారు. దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా లేచి నిలబడి, పార్వతికి ధన్యవాదాలు తెలియజేశారు. దీంతో పార్వతి పాడిన పాట సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. లక్షలాది వీక్షకులు తమ మొబైల్‌ ఫోన్ల నుంచి ఈ పాటను షేర్‌ చేశారు. పార్వతి విన్నపానికి మంత్రి లైవ్‌లో ఓకే చెప్పారు. డోన్‌ ఆర్టీసీ అధికారులు స్పందించారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. డోన్‌ నుంచి దేవనకొండకు వెళ్లే బస్సును లక్కసాగరం మీదుగా తిప్పుతున్నారు. పార్వతి మాట్లాడుతూ 'నేను చదువుకునే రోజుల్లో గ్రామానికి ఎవరైనా రావాలంటే బస్సులేక చాలా ఇబ్బందిపడేవారు. నేను కూడా చాలాసార్లు ఇబ్బందిపడ్డాను. ఉదయం ఆరు గంటలకు, సాయంత్రం ఆరు గంటలకు ఒక్క బస్సు వచ్చేది. ఒక్క ట్రిప్పుతో సరిపోక చాలా ఇబ్బంది పడేవాళ్లం. డోన్‌, లేదా ఇతర ఊర్లకు వెళ్లాలంటే కష్టంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో బస్సులేక డోన్‌ రైల్వేస్టేషన్లో రాత్రి అక్కడే ఉండి ఉదయం వచ్చిన సందర్భాలున్నాయి. అలాంటి కష్టాలు ఎవ్వరూ పడకూడదని కోటి గారడిగిన వెంటనే తడుముకోకుండా మా ఊరికి బస్సు కావాలని అన్నాను. భవిష్యత్తులో ఒక సంగీతం స్కూలు పెట్టి, నాలాంటి పేద అమ్మాయిలకు, అబ్బాయిలకు సంగీతం నేర్పాలనేది నా లక్ష్యం. అమ్మానాన్న, అన్నలు, అక్క నా చదువుకు, సంగీతం నేర్చుకోవడానికి పూర్తి సహకారం అందించారు. ''అంతదూరం పంపి పాటలు నేర్పడం అవసరమా? వయసొచ్చిన పిల్లకు పెళ్లి చేసి పంపొచ్చు కదా!'' అన్న మాటలను పట్టించుకోకుండా చదువుకు, సంగీతం నేర్చుకోవడానికి పంపారు. పంటలు పండక మా కుటుంబం అప్పుల్లో కూరుకుపోయింది. ముందుగా అప్పులు తీర్చాలి' అంటుంది పార్వతి.

విరిసిన... వసంత గానం....

  • పాటే ప్రాణం.. పిల్లలే ప్రపంచం..

మెంటర్స్‌ ఛాలెంజ్‌ రౌండ్‌లో భాగంగా ఫస్ట్‌ ఎపిసోడ్‌లో 'ఓ వాన పడితే' అనే పాటతో వరంగల్‌ నుండి వచ్చిన కళ్యాణి చింత జడ్జీలను మెస్మరైజ్‌ చేశారు. అంతేకాదు కళ్యాణి చింత పాడిన పాటకు మ్యూజిక్‌ లవర్స్‌ ఫిదా అయ్యారు. అయితే వృత్తిరీత్యా మ్యూజిక్‌ టీచర్‌ అయిన కళ్యాణి లైఫ్‌లోని కష్టాలను గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. చిన్న వయస్సులోనే ప్రేమించి పెళ్లిచేసుకున్నప్పటికీ.. ఆ సంతోషం తన లైఫ్‌లో కంటిన్యూ కాలేదని స్టేజ్‌పైనే ఎమోషనల్‌ అయ్యారు. నాలుగేళ్లు చాలా కష్టాలు పడినట్లు చెప్పారు. ఇద్దరి పిల్లలనూ పోషించడానికి తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను షేర్‌ చేసుకున్నారు. ఆమె కథను విన్న జడ్జీలు సైతం కంటనీరు పెట్టుకున్నారు. కాగా తన బలమైనా.. బలహీనతైనా వాళ్లిద్దరే అంటూ స్టేజ్‌పైకి వచ్చిన కొడుకుల్ని పట్టుకుని ముద్దుపెట్టుకున్నారు. దీంతో సెట్‌ మొత్తం ఉత్సాహంలోకి వెళ్లింది. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ తన లాంటి ఎంతోమంది అమ్మాయిలు బయటకు రాలేక కష్టాలను అనుభవిస్తున్నారని, అలాంటివారికి తాను ఓ రోల్‌ మోడల్‌గా నిలవాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

  • విరిసిన... వసంత గానం....
  • సంగీతం కోసం జాబ్‌ మానేశా..

కంటెస్టెంట్‌ అర్జున్‌ విజరు, కేరళ అలప్పీ నుంచి వచ్చారు. రాజమండ్రి ఆదిత్య కాలేజీలో చదువుకున్నారు. లాంచింగ్‌ ఎపిసోడ్‌లో అర్జున్‌ మాట్లాడుతూ 'మాదో చిన్న ఫ్యామిలీ. అమ్మ, నాన్న, అక్క, నేను. ఈ కాంపిటీషన్‌కి నా కుటుంబసభ్యులు అందరూ చాలా సపోర్ట్‌ చేశారు. ఓకల్‌ లెవల్లో అనేక బహుమతులు వచ్చాయి. ఎనిమిది సంవత్సరాలు కర్ణాటక సంగీతం, రెండు సంవత్సరాలు కథాకళి నేర్చుకున్నాను. ఒకానొక సమయంలో సంగీతం ఆపేయమన్నారు నాన్న. ఆ తర్వాత రెండేళ్లు వర్క్‌ చేసినా సంతృప్తి అనిపించలేదు. ఓ పాట పాడి, రికార్డ్‌ చేసినప్పుడు అనేక లైక్స్‌ వచ్చాయి. ఆ సందర్భంలో అమ్మ బాగా సపోర్ట్‌ చేశారు. రెండు సంవత్సరాల తర్వాత జాబ్‌ మానేసి, వేరే జాబ్‌ పేరుతో హైదరాబాద్‌ వచ్చా. నితీష్‌ అన్న గైడెన్స్‌తో ఆడిషన్స్‌ ఇచ్చాను. సంగీతానికి ''బేసిక్‌గా ఓ భాష బ్యారియర్‌ కాదని'' అనుకుంటున్నాను. అందుకే ఊరు దాటి మీ సపోర్ట్‌ కోసం వచ్చేశాను!' అంటూ చెప్పుకొచ్చారు.

  • ఆమెరికా టూ ఇండియా

ప్రణవ్‌ కౌశిక్‌ మ్యూజిక్‌పై ఉన్న అభిమానంతో ఖండాంతరాలు దాటి అమెరికా నుంచి వచ్చాడు. 'ఇంతేనా.. ఇంతేనా.. ప్రేమంటే ఇంతేనా పడినదాకా తెలియదే..' అనే పాటతో ఎంట్రీ ఇచ్చాడు. నాలుగేళ్ల వయస్సులో కుటుంబం యుఎస్‌ వెళ్లి అక్కడే సెటిల్‌ అయ్యింది. న్యూయార్క్‌లో కర్ణాటక క్లాసికల్‌ సంగీతం నేర్చుకున్నాడు. సంగీతంపై ఉన్న మక్కువతోనే జీ సరిగమప ఆడిషన్స్‌కి వచ్చాడు. అయితే సరిగ్గా తెలుగురాని తనలాంటి వారికి కూడా తెలుగు పాటలు పాడే అకాశం ఇవ్వడం తన అదృష్టమని ప్రణవ్‌ తెలిపారు. అయితే 2018లో నాటాలో రన్నరప్‌గా గెలిచిన తాను.. ఆ స్ఫూర్తితోనే ముందుకు కదిలానంటూ తన గురించి చెప్పుకొచ్చారు. పార్వతితో ప్రణవ్‌ పాడిన డ్యూయట్‌ ఇప్పుడు వ్యూవర్స్‌కు దగ్గర చేసింది. అందరినోటా ఇదే మాట.

  • విరిసిన... వసంత గానం....
  • ఒంటరి తనం పోగొట్టేది పాటే..

విశాఖపట్నంకు చెందిన సాయి సాన్విద్‌ది చిన్నప్పటి నుంచి ఫీమేల్‌ వాయిస్‌. 'బై బర్త్‌ వచ్చిన ఈ లోపం వల్ల చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్‌ దగ్గర, సొసైటీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చిన్న వయస్సులోనే తండ్రి చనిపోయారు. 18 ఏళ్ల వయస్సులో క్యాన్సర్‌తో అమ్మ చనిపోయారు. ఈ ఒంటరితనం నుంచి నన్ను బయటకు తీసుకొచ్చింది పాట. ఇంట్లోవాళ్లను ఇబ్బందిపెట్టలేక ఇల్లు వదిలేసి వచ్చేశాను. ఏదో ఒకటి సాధించాకే ఇంటికి వెళ్లాలనుకున్నా. డబ్బింగ్‌ ఫీల్డ్‌లో అవకాశాలు రావడంతో అవరోధాన్ని అనుకూలంగా మార్చుకుని, జీ సరిగమపలో సింగర్‌గా మీ ముందుకొచ్చా' అంటూ.. ''అంతిష్టమేందయ్యా'' పాటతో తనను పరిచయం చేసుకున్నారు.

  • అమ్మ, తమ్ముడి ఆశీస్సులతోనే..

కర్ణాటక చిక్కబళ్లాపూర్‌ నుంచి వచ్చిన చరణ్‌తేజ్‌ 'ఆకాశం తాకేలా.. వడగాలై ఈ నేల' అనే పాటతో ఎంట్రీ ఇచ్చారు. అమ్మ ఆశీస్సులతో తమ్ముడి సహకారంతోనే తాను ఈ వేదికపైకి వచ్చినట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి తమను అమ్మ చాలా కష్టపడి పెంచిందని, తమ కోసం అమ్మ వంటలు చేస్తూ పెంచిందని చెప్పారు. ప్రస్తుతం తాను, తమ్ముడు ఫుడ్‌ డెలివరీ బార్సుగా పనిచేస్తున్నామని, తనలోని ప్రతిభను గుర్తించి తమ్ముడు తనకు సహకరించాడని చెప్పాడు. తాను నిర్వర్తించాల్సిన బాధ్యతను తమ్ముడు భుజాన వేసుకుని, తనను ప్రోత్సహించాడన్నారు. ఇలా ఇద్దరి సహకారంతోనూ తాను ఇక్కడికి రాగలిగానని చెప్పుకొచ్చాడు.

  • డానియేల్‌ భిన్నత్వంలో ఏకత్వం..

భారతదేశం భిన్న మతాలు, భిన్న జాతులు.. భిన్న కులాల కలయిక. హిందూ ముస్లిం క్రిస్టియన్‌ భాయీ..భాయీ.. నినాదం ప్రతీ విషయంలో ప్రతిఫలిస్తుంటుంది. ఒకరినొకరు గౌరవించుకోవటం.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, వారి ప్రేమాభిమానాలకు చాటుకుంటుంటారు. అయితే అదే విషయాన్ని రుజువు చేస్తూ డానియేల్‌ రాజు..'ఓం నమో నారాయణాయ' అంటూ దశావతారంలోని పాటతో ఎంట్రీ ఇచ్చారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా డానియేల్‌ ఎయిమ్స్‌ రారుపూర్‌లో నర్స్‌గా పనిచేస్తున్నారు. ఓ పక్క సమాజ సేవ చేస్తూనే.. మరోపక్క సంగీత సాధన చేస్తున్నారు. అయితే కరోనా సమయంలో చాలా ఇబ్బందిపడ్డానని, ఆ సమయంలో ఏడాది పాటు ఇంటికి కూడా వెళ్లలేకపోయానని, కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని, అప్పుడూ తనను ఒంటరితనం నుంచి సంగీతమే బయటపడేసిందని చెప్పుకొచ్చారు. రీసెంట్‌గానే స్టాఫ్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌గా ప్రమోట్‌ అయ్యానని, ఆయినా ఆడిషన్స్‌ కారణంగా తాను ఆ సంతోషాన్ని పూర్తిగా ఎంజారు చేయలేకపోయానని వివరించారు.

  • ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత..

'లాహె.. లాహె' పాట పాడి తన గొంతుతో అందరినీ ఆకట్టుకున్నారు బెంగళూరు నుంచి వచ్చిన వినూత్న. ఇక జడ్జి కోటిగారు ఎలా వచ్చిందమ్మా ఈ వాయిస్‌ నీకు అని అడగ్గా.. 'చిన్నప్పుడు మైక్‌ మింగేశాను' అంటూ క్యూట్‌గా సమాధానం చెప్పారు. ఇక వేదికపైకి వచ్చిన తల్లిదండ్రులు తమ ఆకాంక్షలు, అభిరుచుల నుంచి 'వినూత్న' వచ్చిందని చెప్పగా.. మొత్తం క్రెడిట్‌ అంతా తన భార్య కిరణ్మయిదే అని చెప్పారు. దీనికి జడ్జి అనంత శ్రీరామ్‌ 'లాహె లాహె నువ్వు సూపరెహె' అంటూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత 'అందగాడా.. అందగాడా' పాటతో మెప్పించిన గాయత్రి తన భర్త, చిన్న పాప స్వరమయూకతో పోటీలకు వచ్చారు. తమది ప్రేమ వివాహమని, అయినా ఏనాడూ ప్రపోజ్‌ చేసుకోలేదని, రింగ్స్‌ మార్చుకోలేదని చెప్పుకొచ్చారు. వాళ్ల పాప స్వరమయూకను యాంకర్‌ శ్రీముఖికి ఇచ్చి.. వేదికపైనే గాయత్రికి ప్రపోజ్‌ చేసి, రింగ్‌ తొడిగారు ఆమె భర్త. అయితే తన భర్త ప్రోత్సాహంతోనే తాను ఈ వేదికకు చేరుకోగలిగానని, బేసిక్‌గా తన భర్త కూడా సింగరే అని చెప్పారు. దీంతో జడ్జీలు ఇద్దరినీ పాడమని కోరగా 'తెలుసా.. మనసా అనే పాటతో..' అంటూ సంగీత ప్రియులను అలరించారు.
అలాగే చెన్నరులోని ఓ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగాన్ని వదులుకొని వచ్చానని చెప్పారు సింగర్‌ వినోద్‌. 'ఏ చిలిపి కళ్లలోన కలవో.. ఏ చిగురు గుండెలోన అలవో' పాటతో ఆకట్టుకున్నారు. రేవంత్‌ ఇన్‌స్పిరేషన్‌తోనే మ్యూజిక్‌ నేర్చుకున్నాని చెప్పారు వినోద్‌. 'ఓ చెలియా.. నా ప్రియ సఖియా' పాటతో ఎంట్రీ ఇచ్చారు రాజమండ్రికి చెందిన వెంకట సుధాన్షు. తన గమకాలతో జడ్జీలను మెస్మరైజ్‌ చేశారు. అయితే జడ్జి కోటి ఎక్కడి నుంచి వచ్చావు అని అడగ్గా.. హైదరాబాద్‌ సార్‌ అని చెప్పారు. అయితే ఎవరు నీ గురువు అని అడగ్గా.. సరైన ట్రైనింగ్‌ లేని చెప్పగా.. చాలా బాగా పాడావని మెచ్చుకున్నారు.
ఇక విజయవాడ నుంచి వచ్చిన కీర్తనకు జడ్జి శైలజగారు ''బెజవాడ బెబ్బులి'' అని టైటిల్‌ ఇచ్చారు. కీర్తన పాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. చాలా క్యాజువల్‌గా.. ఈజీగా ''ఓ తరమా.. ఆడ తరమా'' అంటూ ఆకట్టుకుంది. నాన్న సహకారంతోనే ఈ స్థాయికి వచ్చినట్లు తెలిపారు.

  • విరిసిన... వసంత గానం....
  • 29 మంది కంటెస్టెంట్స్‌

ఈ సీజన్‌లోని పోటీదారులు.. కర్నూలు నుండి దాసరి పార్వతి, తూర్పుగోదావరి నుండి డేనియల్‌, కడప నుండి విరోద్‌, కేరళ నుండి అరుణ్‌ విజరు, కర్నూలు నుండి వినూత్న, చిక్‌బల్లాపూర్‌ నుండి చరణ్‌ తేజ్‌, హైదరాబాద్‌కు చెందిన నిఖిత నాదెళ్ల, సాయి శ్రీచరణ్‌, అఖిల్‌ సంజోరు, ఐషిత శెట్టి, శ్రీ సాయి సంవిద్‌, సాయివల్లి శివాని, శృతికా సముద్రాల, కాకినాడ నుండి అభినవ్‌ అవసరాల, ముంబైకి చెందిన అస్తా లోహర్‌, నెల్లూరుకు చెందిన ప్రశాంతి, ఇపురుపాలెంకు చెందిన షేక్‌ రసూల్‌, విజయవాడకు చెందిన కీర్తన శ్రీనివాస్‌, అమెరికా నుండి ప్రణవ్‌ కౌశిక్‌, వరంగల్‌ నుండి కళ్యాణి చింత, చెన్నైకి చెందిన స్వరూప్‌ కార్తీక్‌, విశాఖపట్నం నుండి సత్యశ్రీ, కడప నుండి వినోద్‌శర్మ ఇంద్రకంటి, వనపర్తికి నుండి హర్ష గన్నోజి, రాజమండ్రి నుండి వెంకట సుధాంశు, అమలాపురం నుండి వల్లి గాయత్రి, వరంగల్‌కు చెందిన మైనా కంటెం, మచిలీపట్నం నుంచి హృతికా ఆనంది, బెంగళూరుకు చెందిన దీప్తి భట్‌ మ్యూజికల్‌ జర్నీని ఎపిసోడ్‌ లాంచింగ్‌ సందర్భంగా చూపించారు. అయితే వీరిలో పదిమందితో పాప్‌ ఆల్బమ్‌ చేస్తానని జడ్జి స్మిత హామీ ఇచ్చారు.

  • విరిసిన... వసంత గానం....
  • గుర్తింపు తెచ్చిన 'జోడీ' ఆటోవాలా..

షేక్‌ రసూల్‌.. చీరాల మండలంలోని చీపురుపాలెం గ్రామంలో ఆటోడ్రైవర్‌. ప్రజల ప్రోత్సాహంతోనే తాను జీ సరిగమప వేదికపైకి వచ్చినట్లు తెలిపారు. 'కమ్ముకున్న చీకట్లోనా' పాటతో తన పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. తల్లిదండ్రుల మరణానంతరం అనేక ఇబ్బందులు పడ్డారు. 'ఊర్లో రసూల్‌ అనే పేరుకన్నా ''జోడీవాడు'' అని అడిగితేనే గుర్తుపడతారు. అటోపై ''జోడి'' అని రాసుంటుంది. దీంతో అదే పేరుగా మారింది. అయితే ''ఆటోడ్రైవర్‌ పాటలు పాడితే సింగర్‌ అయిపోతారా?'' అని హేళన చేసేవాళ్లు. తనలోని కళను గుర్తించేలా చేయాలనే సంకల్పంతో తన భార్య కాళ్ల పట్టీలు తాకట్టు పెట్టి మరీ తనను ఈ వేదికపైకి పంపినట్లు తెలిపారు రసూల్‌.

- ఉదయ్ శంకర్‌ ఆకుల
ఫోన్‌ : 7989726815