ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : రాష్ట్ర చరిత్రలోనే విఫలమైన ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని టిడిపి రీజనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య విమర్శించారు. బుధవారం పార్వతీపురంలో ప్రయివేటు హాల్లో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయనతోపాటు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష నాయకులు ప్రస్తావిస్తే, గ్రహించి సరిదిద్దుకోవాల్సింది పోయి, వారిపై కక్ష గట్టి అక్రమ కేసులతో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును అరెస్టుచేసి, 40 రోజులుగా జైల్లో కూర్చోబెడితే పార్టీశ్రేణుల మనోధైర్యం దెబ్బతింటుందని, తద్వారా ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని కుత్సితపు ఆలోచనలో చేసినా... అవేవీ టిడిపి బలం ముందు నిలవలేదన్నారు. చంద్రబాబుకు ప్రజలంతా అండగా నిలిచి ఆదరించారన్నారు. అనంతరం టిడిపి బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఐటిడిఎలను పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల గిరిజనులకు తీవ్రమైన నష్టం వాటిల్లిందన్నారు. ప్రతిఒక్కరూ క్షేత్రస్థాయిలో సైనికుల్లా పనిచేసి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు నిమ్మక జయకృష్ణ, తోయక జగదీశ్వరి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ డి.శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకటనాయుడు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు జి.రవికుమార్, సిరిపురపు భాస్కరరావు, మండల అధ్యక్షులు దొగ్గ మోహనరావు, పెంకి వేణుగోపాలరావు, పెంకి రామ్మోహనరావు పాల్గొన్నారు.
బయటపడ్డ అసంతృప్తి
ఈ సమావేశంలో టిడిపి పార్వతీపురం మండల అధ్యక్షులు దొగ్గ మోహనరావు మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర ఏకపక్షంగా వ్యవహరిస్తూ నాయకులను, కార్యకర్తలను విస్మరిస్తున్నారని అనగానే, ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఆయనకు అనుకూలంగా, వ్యతిరేకంగా అక్కడున్న వారు నినాదాలు చేయడంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ జోక్యం చేసుకుని అసంతృప్తి వ్యక్తం చేయడానికి ఇది సమయం కాదన్నారు. సమావేశం అనంతరం ప్రతిఒక్కరికీ అంతర్గతంగా మాట్లాడే అవకాశం ఇస్తామని, వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. పార్టీ అధినేత కష్టంలో ఉన్న సమయంలో అందరూ ఐక్యంగా ఉండాలని గదమాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది.










