Nov 18,2021 06:58

గ్లాస్గోలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్‌-26) లక్ష్య సాధనలో విఫలమైంది. వాతావరణ మార్పులు పెనుముప్పుగా మారుతున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో ధరిత్రి పరిరక్షణకు, తద్వారా భూగోళం మీది సకల జీవరాశి పరిరక్షణకు ఒక్క అడుగైనా ఈ సదస్సు ద్వారా ముందుకు పడుతుందని ఆశించిన వారికి తీవ్ర నిరాశే మిగిలింది. దాదాపు రెండు వందల దేశాలకు చెందిన పాతిక వేల మంది ప్రతినిధులు సుదీర్ఘంగా సాధించిన మేథోమథనం, వివిధ దేశాధి నేతల ప్రసంగాలతో హోరెత్తించిన సదస్సు ఫలితం శూన్యంగా మారడం బాధాకర పరిణామం. వాతావరణ మార్పులతో భూగోళానికి పొంచి ఉన్న ముప్పును మరో మారు నొక్కి చెప్పడం మినహా ఈ సదస్సు సాధించనదేమీ లేదు. ఆ ముప్పును తప్పించడానికి అవసరమైన చర్యల విషయంలోనూ, కర్బన ఉద్గారాల నియంత్రణ విషయంలోనూ కాప్‌-26 చేతులెత్తేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే సదస్సులో పాల్గొన్న వివిధ దేశాధినేతల మాటలైతే కోటలు దాటయిగాని, ఆచరణ దిశలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సదస్సు ప్రారంభానికి ముందే గ్లాస్గో నగరంలో వివిధ దేశాలకు చెందిన కర్బన ఉద్గారాల కంపెనీల ప్రతినిధులు తిష్ట వేయడం, లాబీయింగ్‌ చేయడం కూడా ఈ వైఫల్యానికి కారణమని పరిశీలకులు చెబుతుండటం గమనార్హం.
కీలకమైన వాతావరణ న్యాయ (క్లైమేట్‌ జస్టిస్‌) సాధనలో కాప్‌-26 చతికిలపడింది. ప్రపంచ జనాభాలో 70 శాతం ప్రజానీకం అభివృద్ధి చెందడానికి కర్బన వినియోగం తప్పనిసరిగా మారిన పరిస్థితుల్లో వారి పురోగతికి అవసరమైన నమూనాను సదస్సు ఆవిష్కరించలేదు. అదే సమయంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకునే విషయంలో ధనిక దేశాలను, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలను ఒకే గాటన కట్టే ప్రయత్నం జరగడం బాధాకరం. సదస్సు బయట గుమికూడిన వేలాది మంది పౌర సమాజ ప్రతినిధులు ఈక్విటీ కోసం, ఎప్పుడో ఆమోదం పొందిన సూత్రం సాధారణ, వివిధ విభిన్న బాధ్యతల (కామన్‌ బట్‌ డిఫరెన్సియేటెడ్‌ రెస్పాన్సిబిలిటీస్‌-సిబిడిఆర్‌) అమలు కోసం చేస్తున్న నినాదాలు సదస్సు ప్రతినిధుల చెవికి సోకలేదు. తమ దేశాల్లో శిలాజ ఇంధన వినియోగం ఒక్క పిసరు కూడా తగ్గించడానికి అంగీకరించని ధనిక దేశాలు, అదే సమయంలో ఇతర దేశాల్లో ఆ తరహా ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం చేసేది లేదని ప్రకటించాయి. దీనినే ముందడుగుగా ఆ దేశాలు చెప్పుకుంటున్నప్పటికీ ఆచరణలో పేద దేశాలను మరింత ఒత్తిడికి గురిచేయడానికి, అప్పుల ఊబిలో ముంచడానికి ఈ నిర్ణయం దోహదపడనుంది.
పేద, వర్థమాన దేశాల భద్రత, అభివృద్ధి కోసం 2025వ సంవత్సరం వరకు ప్రతి ఏడాది ధనిక దేశాలు జమ చేయాల్సిన 100 బిలియన్‌ డాలర్లపై తాజా సమావేశంలోనూ సుదీర్ఘ చర్చ జరగడం దేనికి నిదర్శనమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు ఒక్క ఏడాది కూడా నిర్దేశించిన మొత్తాన్ని జమ చేయని అమెరికాతో సహా ఇతర ధనిక దేశాల ప్రతినిధులు అభివృద్ధి చెందుతున్న దేశాలనూ వాటా పంచుకోవాలని కోరడం, అలా అయితేనే పేద దేశాలకు న్యాయం చెయ్యగలమని చెప్పడం విడ్డూరం! దేశంలో భూతాప నివారణ ప్రణాళికలు అమలు చేయడానికి రెండున్నర లక్షల కోట్ల డాలర్లు అత్యవసరమని భారత్‌ కోరడం ఈ సందర్భంగా గమనార్హం. వాతావరణ మార్పుల విధ్వంసాన్ని కేవలం పరిహారం చెల్లింపు అంశంగా చూడకూడదని, మరింత విస్తృతంగా పునర్‌నిర్మాణానికి, ఆ ముప్పును నివారించడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్యారిస్‌ సమావేశ ప్రతిపాదనపై తాజా సమావేశం ఎటూ తేల్చలేదు. కాప్‌-26కు కొద్దిరోజుల ముందు సమావేశమైన జి-77 దేశాలు వాతావరణ మార్పులు ఇప్పటికే పేద దేశాల మనుగడును ప్రశ్నార్ధకంగా మార్చాయని, ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని దేశాల ఉనికే మాయమయ్యే పరిస్థితి వస్తోందని వాపోయాయి. అయినా, కాప్‌ స్పందన నామమాత్రమే! కార్పొరేట్ల లాభాలే ధ్యేయంగా నయా ఉదారవాద విధానాలను అమలు జరిపే సంపన్న దేశాల ఆధిపత్యం కొనసాగినంత కాలమూ పర్యావరణ పరిరక్షణ ఒట్టిమాటేనన్న చేదు నిజాన్ని కాప్‌-26 మరో మారు రుజువు చేసింది. ఈ వైఫల్యమే పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం నిర్మించడం ఎంత అవసరమో మనకు తెలియచేస్తోంది.