Mar 14,2023 23:53

మాట్లాడుతున్న ఐటిడిఎ ఎపిఒ శ్రీనివాసరావు

ఐటిడిఎ ఎపిఒ శ్రీనివాసరావు
ప్రజాశక్తి - రంపచోడవరం

రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని 11 మండలాలలో విపత్తుల సంభవించినప్పుడు వెంటనే తగు చర్యలు తీసుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రంపచోడవరం ఐటిడిఎ అసిస్టెంట్‌ ప్రాజెక్టు అధికారి జనరల్‌ సిహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం స్థానిక యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ సమావేశ మందిరంలో 11 మండలాలకు సంబంధించిన వందమంది వాలంటీర్లతో విపత్తుల సమయంలో సహాయక చర్యలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు వెంటనే తగు చర్యలు తీసుకోవడానికి ఒక్కొక్క పంచాయితీ నుండి ఒక్కొక్కరిని ఎంపిక చేసి మొత్తం 100 మంది వాలంటీర్లకు ఈ నెల 14 నుండి 25వ తేదీ వరకు 12 రోజుల పాటు 15 శాఖలకు సంబంధించిన అధికారులతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
రంపచోడవరం మండల అధ్యక్షురాలు బంధం శ్రీదేవి మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని కాపాడేందుకు ఇది ఒక గొప్ప అవకాశమని తెలిపారు. ఏజెన్సీలోని వయస్సుతో సంబంధం లేకుండా అనేకమంది వ్యాధుల పట్ల అవగాహన లేక చనిపోతున్నారని, వారికి అందించాల్సిన సేవలు గురించి తెలుసుకొని అవగాహన కల్పించాలని కోరారు. జెడ్పిటిసి సభ్యురాలు పండ వెంకటలక్ష్మి, రంపచోడవరం సర్పంచ్‌ ఎం.బొజ్జయ్య మాట్లాడుతూ ఏజెన్సీలో వర్షాకాలంలో ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కింద ఉండరాదన్న విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. డివిజనల్‌ అభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు మాట్లాడుతూ విపత్తుల సమయంలో ఎక్కడ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకునే విధంగా ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. డివిజనల్‌ పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, విపత్తుల కోర్సు శిక్షణ డైరెక్టర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఐదు వేల మందికి విపత్తుల ఎదుర్కొనే విధంగా ఆపద మిత్రులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ ఆపదమిత్ర శిక్షణ పొందుతున్న వారికి ఎనిమిది లక్షలు వరకు ఇన్సూరెన్స్‌ చేయించడం జరుగుతుందని, ఐడెంటీ కార్డులు, విపత్తుల ఎదుర్కొనే విధంగా కిట్లు ఇస్తామని తెలిపారు. రంపచోడవరం ఎంపీడీవో ఎంవిఆర్‌ కుమార్‌ బాబు, ఇఓపిఆర్‌డి జాన్‌ విల్టన్‌, ఈపీఎం కిరణ్మై పాల్గొన్నారు