Sep 08,2022 23:55

శిక్షణ కార్యక్రమం ప్రారంభంలో మాట్లాడుతున్న ఆచార్య సమత

ప్రజాశక్తి-విశాఖపట్నం : విపత్తులు సంభవించిన సమయంలో సమర్ధత, సమన్వయం, సన్నద్ధత కలిగి ఉండటం ఎంతో అవసరమని ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత అన్నారు. ఏయూ హెచ్‌ఆర్‌డిసి కేంద్రంలో విపత్తు నిర్వహణపై నిర్వహిస్తున్న ఐడిఆర్‌సి కోర్సును ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, సహజ విపత్తులు, మానవ ప్రమేయం కారణంగా ఏర్పడే విపత్తులను నేడు మనం చూస్తున్నామన్నారు. విపత్తులపై తగిన అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. విపత్తులు సంభవించిన సందర్భంలో అనుసరించాల్సిన విధానాలపై విద్యార్థులకు అవగాహన అందించాలన్నారు. ఇటీవల ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్‌ విపత్తును అందరూ సమిష్టిగా పనిచేస్తూ నియంత్రించడం సాధ్యపడిందన్నారు. దీనిని నిరోధించడానికి విభిన్న వ్యూహాలను, విధానాలను అనుసరించిన సందర్భాలను ఉదహరించారు.
విపత్తులు సంభవించిన సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఎంతో అవసరమన్నారు. వీటిని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన వ్యవస్థను కలిగి ఉన్నామన్నారు. విభిన్న రంగాల నిపుణులు అందించే సూచనలు, జ్ఞానం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఆర్‌డిసి సెంటర్‌ సంచాలకులు ఆచార్య ఎన్‌ఎడి పాల్‌, ఆచార్య శ్యామల, డాక్టర్‌ రాజమాణిక్యం, 33 మంది డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు పాల్గొన్నారు.