ప్రజాశక్తి- చింతూరు
మండలంలోని ఏడుగుర్రళ్లపల్లి పంచాయతీ పరిధి చుక్కలపాడు గ్రామానికి చెందిన గిరిజనులకు ఆశా స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి సయ్యద్ సుభాని రూ.20వేలు విలువ చేసే విప్ప గింజలు ఒలిచే మిషన్‌ను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 గంటల్లో విప్ప గింజలు ఒలిచే పనిని ఈ మిషన్‌తో అరగంటలో చాలా సులువుగా పూర్తి చేయవచ్చునని తెలిపారు. దీనిని జాగ్రత్తగా వాడుకుంటే గ్రామంలోని అన్ని కుటుంబాల వారు లబ్ధిపొందవచ్చని చెప్పారు. ఇప్పటివరకు తెలంగాణా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 60 మిషన్లు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఎన్‌ఆర్‌ఐ ప్రొఫెసర్ రతన్ ముల్చందని సహకారంతో చింతూరు మండలంలో ఎంపిక చేసిన 6 ఆదివాసీ గ్రామాల్లో 6 మిషన్లు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. మన పరిసరాల్లోని అడవులు, నదులు, భూమిని రక్షించే బాధ్యత మనందరిపై సమిష్టిగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సంయుక్త కార్యదర్శి జె.వెంకటేష్, గ్రామ పెద్ద రవ్వ జోగయ్య, మహిళా సభ్యులు పాల్గొన్నారు.










