ప్రజాశక్తి- చింతూరు
ఆదివాసీ అడవి బిడ్డల జీవితాల్లో విడదీయలేని అంతర్భాగమైనది విప్ప చెట్టు. అది ఎంతో విలువైనది. ఆదివాసీలకు ప్రకృతి ప్రసాదించిన కల్పవృక్షం. ఏజెన్సీలోని అడవుల్లో లభించే అనేక రకాల అటవీ ఫలసాయాల్లో విప్ప ఆదివాసీలకు ప్రత్యేకమైనది. ఆ చెట్టు ద్వారా ఆదివాసీలకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. విప్ప కాయలు, విప్ప పూలు ఆదివాసీలకు ఆదాయ వనరులుగా మాత్రమే కాకుండా, వారి ఆచార వ్యవహారాల్లోనూ విప్ప చెట్టుకు ప్రాముఖ్యత ఉంది. ఆదివాసీలు విప్ప చెట్టు నుండి వచ్చే ఫలసాయాన్ని కలియుగ భీముని పంటగా పిలుస్తారు.
ఏజెన్సీ ప్రాంతంలో విప్ప చెట్లు విరివిగా ఉన్నాయి. ప్రకృతి ప్రసాదించిన వాటిలో మేటిగా విప్ప పలు విధాలుగా మానవ జీవితంతో ముడి పడిపోయింది. మార్చి నెల చివరి వారం నుండి ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో గిరిజనులు భీమల్ పెయిన్ చెట్టు పండుగ సందర్భంగా విప్ప చెట్టుకు పూజ చేసిన తర్వాత విప్ప పూల సేకరణ ప్రారంభిస్తారు. స్వయంగా అల్లిన వెదురు బుట్టలోనూ, గంపల్లోనూ మాత్రమే పూలను సేకరిస్తారు. పోక్కలు అని కూడా ఈ ప్రాంత వాసులు పిలుస్తారు. కొమరం భీమ్ సిర్పూర్ లింగాపూర్ ఏజెన్సీ జిల్లాల్లో విప్ప చెట్టును తమ కులదైవంగా కొలుస్తారు.
విప్పతో ఎన్నో ఉపయోగాలు
విప్పకాయల నుండి సేకరించిన తప్పును స్థానిక గానుగల్లో ఆడించి ఇప్ప నూనె తీస్తారు. అలా తీసిన విప్ప నూనెను పిండి వంటల్లో వాడుతారు. విప్ప నూనెను పూజా కార్యక్రమాల్లో కూడా దీపారాధనకు ఉపయోగిస్తారు. నూనె తీయగా వచ్చిన పిప్పిను సబ్బుల తయారీలో వినియోగిస్తారు. 30 ఏళ్ల పైబడిన విప్పచెట్టు నుండి సుమారు 100 నుండి 150 కేజీల విప్పపువ్వు లభిస్తుంది. విప్ప పూలు బాలింతలకు ఎంతో ఉపయోగకరంగా ఆయుర్వేద వైద్య విధానం తెలుపుతుంది. పిల్లలు వీటిని నేరుగా తినటం వలన రక్తహీనత లోపం నుండి బయటపడతారు.
తీవ్రమైన ఉష్ణోగ్రత నుండి ఉపశమనం కోసం వేసవిలో ఆదివాసీలు అంబలి తాగుతారు. అందులో విప్ప ఫ్రై స్నాక్స్‌గా నంజుకుంటారు. విప్ప పప్పులను జొన్న పిండిలో కలిపి చేసే గారెలు అద్భుత రుచి కలిగి ఉంటాయి. పలు రకాల స్వీట్, హాట్ తయారీలో కూడా విప్ప పూల మిశ్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గోధుమ పిండితో చేసే విప్ప లడ్డు రుచికరంగా ఉంటుంది. విప్ప కుడుములు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. రక్తహీనతతో బాధపడే వారికి విప్పపూల వంటకాలు ఎంతో దోహదపడతాయి. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ సర్టిఫికెట్ కోసం ఐటిడిఎ ప్రయత్నం చేస్తుంది.
గిరిజన సంప్రదాయాల్లో...
విప్ప పూలతో నాణ్యమైన సారా తయారు చేస్తారు. ఇది గిరిజన సంప్రదాయాల్లో అంతర్భాగంగా ఉంటుంది. వివాహ శుభకార్యాల్లోనూ, దినకర్మకాండ సందర్భంలోనూ ఇంటికి వచ్చిన అతిథులకు విప్ప సారాను మర్యాదపూర్వకంగా ఇస్తారు. విప్పపూల ఆవిరిని కలిపి సారాను తయారు చేస్తారు. ఇది ఎంతో శ్రేష్టమైనదని వైన్ షాపుల్లో అమ్ముడుపోయే మద్యం కన్నా ఎంతో నాణ్యతతో కూడినదిగా పేరుంది. ఎటువంటి రసాయనాలు, క్రిమిసంహారక మందులను వాడకుండా కేవలం విప్ప పూలను బెల్లం ఊటను కలిపి కుండలలో తయారు చేసే విప్ప సారాకు మంచి గిరాకీ కూడా ఉంది. స్వచ్ఛమైన విప్పసారా అనేక రకాల శారీరక రుగ్మతల నయం చేయడానికి ఎంతో దోహదపడుతుందని నానుడి ఉంది.










