Apr 25,2021 17:00

మనకు తెలిసిందొకటే వుండాలి
అది తిరుగుబాటై వుండాలి
మనల్ని వెనక్కెనక్కి చీకటిలోకి నెడుతున్నా
చేతులు కట్టుకోవడం వినయం కాదు
అనాదిగా ఊరిచివర
గుంజల్ని పాతేసినట్టు
కొందరివి మాత్రమే ఇళ్లను పాతేస్తే
వెలిని ప్రశ్నించలేని గొంతుకకి గౌరవం లేదు..!

మబ్బుల్ని చీల్చుకునొచ్చి
ప్రచండమయ్యే వేసవి సూర్యుడిలా విప్లవం
పురుడు పోసుకోకపోతే
లోయలోనే జీవితాలు గడచిపోతాయి
మనం గట్టుమీదకి చేరాలంటే కలబడాలి
కలతబడితే కాదు
కలబడితేనే
కలగన్న ప్రగతిని సొంతం చేసుకోగలం
అసమానత్వపు మారిని తరిమికొట్టగలం!
ఊరకనే ఏదీ వరించదు
మన ఊపిరి ఊరిమధ్యలో ఎందుకు లేదు
మన తిండిమీద వేరొకడి నిఘా దేనికీ
మనం అడుగులు వేస్తే
గర్భగుడిలో దేవుడెందుకు మైలపడతాడు
ఏం పాపం చేశామనీ మనం అస్పృశ్యులం
నిజానికి....
మనసునిండా మైల ఉన్నోళ్లే గదా అస్పృశ్యులూ..
ప్రతిఘటన లేకపోతే
ప్రతిఘటనలోనూ మనం పీడితులమే..!

డప్పు కొట్టుకుంటూ వెళ్దాం
వెలిరేఖలు గీసేదెవరో
కలిచేష్టలకి పూనేదెవరో
అనాది తప్పులచిట్టాని చాటింపువేద్దాం
కుట్టిన కొత్తచెప్పులు పట్టుకుని వెళ్దాం
వివక్ష చూపేవాళ్ల మీద విసిరికొడదాం!

విప్లవించకుంటే వెలుగులేదు
కలుగులోనే ఆగిపోయిన మన బతుకులు
ఆత్మగౌరవ నీలిజెండాలై ఎగరవు
దారిచూపే చూపుడు వేలుని తలచుకుని
ముందడుగులు వేద్దాం
వాడలోంచీ ఊరిలోకి
ఊరిలోంచి ఊరినేలే కుర్చీదాకా
ముందడగులు వేద్దాం

అందుకోసం
మన అడుగుల్లో మద్యాన్ని తీసివేయాలి
మనం నిషాలో ఉన్నన్నాళ్లూ ఉషస్సులు రావు!
మిత్రమా!
కాలం అంచులమీద నిలబడ్డా సరే
ఎక్కడైనా వీరులే విప్లవిస్తారు
చేతగానివాళ్లే
బానిసలుగా బాధితులుగా మిగిలిపోతారు!
 

- మెట్టా నాగేశ్వరరావు

mettanageswararao@gmail.com