ప్రజాశక్తి-కాకినాడ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మక పథకాలతో రైతులకు ధీమా, భరోసా కల్పిస్తున్నారని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. శుక్రవారం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ మైదానంలో వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాలో రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాలను అందించారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ గుంటూరులో రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కాకినాడ ఎంపీ వంగా గీత, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ రూరల్ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ జేడీ ఎన్.విజరుకుమార్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ.4.16 కోట్లు రాయితీ సొమ్ము మెగా చెక్‌ను రైతులకు అందించారు. అనంతరం జెండా ఊపి ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ప్రారంభించి రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ రైతు సంక్షేమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కషిచేశారని ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ అదే బాటలో నడుస్తున్నారని పేర్కొన్నారు. పంటసాగులో రైతు వేసే ప్రతి అడుగులోనూ ప్రభుత్వం తోడుగా ఉంటోందని వైఎస్సార్ యంత్రసేవా పథకంతో పెట్టుబడి తగ్గి రైతులు అధిక లాభం పొందేందుకు అవకాశముంటుందన్నారు. కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ పథకంలో భాగంగా కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాల రైతు గ్రూపులకు రూ.5.91 కోట్ల విలువైన 75 ట్రాక్టర్లను రూ.2.29 కోట్ల రాయితీతో అందించినట్లు తెలిపారు. రూ.1.25 కోట్ల విలువైన అయిదు కంబైన్డ్ హార్వెస్టర్లను రూ.44 లక్షల రాయితీతో, రూ.4.61 కోట్ల విలువైన 230 వివిధ వ్యవసాయ యంత్ర పరికరాలను రూ.1.42 కోట్ల రాయితీతో అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ ఎస్.సూర్యప్రకాష్‌రావు, కాకినాడ రూరల్ జెడ్‌పిటిసి నురుకుర్తి రామకృష్ణ పాల్గొన్నారు.










