Jul 05,2023 01:34
బాపట్లలో సీతారామరాజుకు నివాళి అర్పిస్తున్న కోన రఘుపతి

ప్రజాశక్తి-బాపట్ల: భారత స్వాతంత్య్ర చరిత్రలో ఒక మహౌజ్వల శక్తి, విప్లవాగ్ని రగిలించిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. మంగళవారం సీతారామరాజు జయంతి సందర్భంగా బాపట్ల సూర్యలంక రోడ్డులో అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కోన మాట్లాడుతూ భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్య్రాన్ని ప్రసాదించడంలో అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం మరువ రానిదన్నారు. అంతకుముందు కర్లపాలెం మండలం బుద్ధాం గ్రామంలో సీతారామరాజు విగ్రహానికి జిల్లా సంయుక్త కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ సీతారాంరెడ్డి, రైతు నాయకుడు దశరథ మహారాజు, బుల్లెట్‌ నాగరాజు, బెనర్జీ, భాస్కరరాజు, క్షత్రియ యూత్‌ నాయకులు ఉన్నారు.
యువత ముందుకు రావాలి: వేగేశన
మన్యం వీరుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు నేటి యువత ముందుకు రావాలని బాపట్ల తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ అన్నారు. మంగళవారం అల్లూరి 125వ జయంతి సందర్భంగా బాపట్ల సూర్యలంక బీచ్‌ రోడ్డు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. నరేంద్రవర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అరాచక పాలనను అంతమొందించటానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బాపట్ల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు గొలపల శ్రీనివాసరావు, మోదుగుల శంకర్‌రెడ్డి, దయాబాబు, పలువురు పార్టీ నాయకులు, క్షత్రియ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు.
తెల్లదొరలపై వీరోచిత పోరాటం
దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ దొరలపై వీరోచిత పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మేకల ప్రసాద్‌ అన్నారు. మంగళవారం సీతారామరాజు 126వ జయంతి సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం బాపట్ల డివిజన్‌ ఆధ్వర్యంలో బాపట్ల సూర్యలంక రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం బాపట్ల అంబేద్కర్‌ భవనంలో జరిగిన సమావేశంలో మేకల ప్రసాద్‌ మాట్లాడుతూ బ్రిటిష్‌ వారి దోపిడీ విధానాలను భారత పౌరులపై సాగించిన హింసలు సాయుధ పోరాటం ద్వారా ప్రతిఘటించిన దేశభక్తుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. కార్యక్రమంలో ఏఐకెఎంఎస్‌ డివిజన్‌ కార్యదర్శి డి రాములమ్మ, ఏఐకేఎంఎస్‌ నాయకులు రంజాన్‌, విల్సన్‌, పీవైఎల్‌ నాయకులు వి విజరు, పిఓడబ్ల్యు బాపట్ల డివిజన్‌ కార్యదర్శి మువ్వల పల్లవి పాల్గొన్నారు.