ప్రజాశక్తి - ఏలూరు
రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్ భూములను రెగ్యులర్ చేయాలా? వద్దా? అని విచారించడానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో మంత్రులు, శాసన సభ్యులతో నియమించిన కమిటీని రద్దుచేయాలని, విఒటి చట్టం 9/77ను సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం డిఆర్‌ఒ ఎఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ, తలారి ప్రకాష్ మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం 1954 నుండి 2009 వరకూ వామపక్షాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, అభ్యుదయ వాదులు చేసిన అనేక పోరాటాల వల్ల రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఎకరాలకుపైగా పేదలకు ప్రభుత్వాలు అసైన్డ్ చేశాయన్నారు. ఈ భూములను రాష్ట్రంలో పలుకుబడి కల్గిన వారు, పెత్తందారులు, రాజకీయ నాయకులు, దళారులు పేదలను మభ్యపెట్టి అదిరించి, బెదిరించి బలవంతంగానో, పావలానో, పాతికో ఇచ్చి సుమారు 15 లక్షల ఎకరాల భూములను లాక్కొన్నట్లు కోనేరు రంగారావు భూ కమిటీ తెలిపిందన్నారు. అన్యాక్రాంతమైన భూములను పేదలకు తిరిగి అప్పజెబుతామని 2007లో ఆనాటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో వాగ్దానం చేశారని తెలిపారు. అనంతరం వచ్చిన ప్రభుత్వాలు గానీ, రాజశేఖర్ రెడ్డి వారసుడిగా వచ్చిన జగన్ గానీ ఆ హామీని నేరవేర్చక పోగా రాష్ట్రంలో భూముల విలువ పెరిగిన తర్వాత దళిత, బలహీన వర్గాల పేదల భూములను మరింత దోచుకోవడం పెరిగిందని విమర్శలు చేశారు. పేదల భూములను సంపన్నులకు కట్టబెట్టడానికి 9/77 చట్టం అడ్డం వస్తుందని, ఆ చట్టం యొక్క పీక నొక్కడానికి ధర్మాన ప్రసాదరావు నేతత్వంలో వేసిన కమిటీ ఉద్దేశం తప్ప మరొకటి లేదని విమర్శించారు.
భూసంస్కరణలు అమలు జరిగి పేదల చేతుల్లోకి భూమి వచ్చిన చోటనే అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రపంచ అనుభవం అదే చెబుతుందన్నారు. కానీ మన దేశంలో నేటి ప్రభుత్వాలు పేదలకు భూపంపిణీ పక్కన పెట్టి పేదల భూములను కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నాయని మండిపడ్డారు. పేదలకు భూపంపిణీ కోసం చేసిన చట్టాలను తుంగలో తొక్కి దళిత, గిరిజన, బలహీనవర్గాల పేదలకు తీవ్రమైన దోహం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి అనే ముద్దు పేరు పెట్టి 2013 భూసేకరణ, పునరావాస చట్టాన్ని అమలు చేయకుండా దళితులు, పేదరైతులకు చెందిన భూములను బలవంతంగా తీసుకోరాదని, పేదల సాగులో ఉన్న ప్రభుత్వ బంజరు భూములకు, నివాస స్థలాలకు హక్కులు కల్పించాలని, అసైన్మెంట్ చట్టం అమలుకు తక్షణం అన్ని స్థాయిల్లో అసైన్మెంట్ కమిటీలను నియమించి భూ పంపిణీ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.










