Sep 06,2023 00:21

ప్రజాశక్తి-కాకినాడ విఇఒలకు (యనిమేటర్లు) ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతో కాకినాడ డిఆర్‌డిఎ పీడీ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పి.రమణికి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్‌ కుమార్‌, విఒఎల సంఘం జిల్లా అధ్యక్షురాలు గండి మేరీ, డి.ఆనంద్‌ మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో కాకినాడ, కరప, కాజులూరు, కోటనందురు, ప్రత్తిపాడు మండలాల్లో యానిమేటర్లను అక్రమంగా తొలగించారన్నారు. అధికార పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు వేయించుకున్నారని విమర్శించారు. ఉన్నతాధికారుల అవినీతికి కిందిస్థాయి యానిమేటర్లను బలిపశువులను చేస్తున్నారన్నారు. ఇచ్చే జీతం రెండు నెలలు బకాయి పెట్టారని జగ్గంపేట, ఏలేశ్వరం, కిర్లంపూడి మండలాల్లో టెక్నికల్‌ ప్రాబ్లం పేరుతో 14 నెలల వేతనాలను అధికారులు దిగమింగారని విమర్శించారు. యానిమేటర్లకు నెలలు తరబడి బకాయి పెడితే ఎలా బతకాలని ప్రశ్నించారు, ఒకపక్క నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతుంటే ఇచ్చే రూ.8,000 జీతం ఏమి సరిపోతుందని ప్రశ్నించారు. కనీస వేతనం రూ.18,500 చెల్లించాలని, మూడేళ్ల కాలపరిమితిని రద్దు చేయాలని, నేరుగా యనిమేటర్ల బ్యాంకు ఏకౌంట్లలో వేతనాలు వేయాలని, 14 నెలలు వేతన బకాయిలు చెల్లించాలని, కోళ్లు, పాలు, కూరగాయల టార్గెట్లు తీసేయాలని, ప్రమాద బీమా రూ.10 లక్షలు ఇవ్వాలని, గ్రూపుల మెర్జ్‌ ఆపాలని, 5జి మొబైల్‌ ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాకు ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి మద్దతు తెలిపరాఉ. విఒఎల సంఘం నాయకులు ఫణిలక్ష్మి, రత్నం, జగ్గవేణి, వరలక్ష్మి, ఎన్‌.దేవి, జి.రమ్య, ఎన్‌.కృష్ణవేణి, మేరీ, ఎంపీ.రాజు తదితరులు పాల్గొన్నారు.