ప్రజాశక్తి-టెక్కలి రూరల్ : విఒఎలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, విఒఎల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి జి.అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం టెక్కలిలో ఎస్.లక్ష్మి అధ్యక్షతన విఒఎల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఒఎల ఉపాధిని దెబ్బతీసే మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్ రద్దుచేయాలన్నారు. గ్రామ సమాఖ్యల విలీనం ఆపాలని, దీనివల్ల వేలాది మంది విఒఎలకు ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎక్కువ సంఘాలున్న విఒఎల నుండి తక్కువ సంఘాలున్న విఒఎలకు సర్దుబాటు చేయాలని, అందులో రాజకీయ జోక్యం ఉండకూడదని డిమాండ్ చేశారు. విఒఎగా ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో అసిరినాయడు, గంగయ్య, మహాలక్ష్మి, మన్మధరావు, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.










