Dec 26,2022 23:52

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న శ్రీనివాసరావు, రూపాదేవి, సూరిబాబు

ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లిలో ఈ నెల 29, 30 తేదీల్లో జరుగు ఆంధ్రప్రదేశ్‌ వెలుగు విఒఎ (యానిమేటర్ల) సంఘం (సిఐటియు) 4వ రాష్ట్ర మహాసభ వాల్‌ పోస్టురును స్థానిక సిఐటియు కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వివి శ్రీనివాసరావు, అధ్యక్ష కార్యదర్శులు కె.సూరిబాబు, సిహెచ్‌ రూపాదేవి మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలు మహాసభల సందర్భంగా 29న ఉదయం 10 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి గవరపాలెం పార్క్‌ సెంటర్‌ వరకు భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో ఉభయగోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నరసింగరావు, సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.రూపాదేవి, కె.ధనలక్ష్మి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ప్రసంగిస్తారని చెప్పారు. వివి.రమణ రైతు భారతిలో రెండో రోజు ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. గత మూడేళ్లలో వివోఏలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాల పరిమితి సర్క్యులర్‌ రద్దు, వేధింపులు, తొలగింపులు, ఉద్యోగ భద్రతపై సమీక్ష నిర్వహించి, భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపకల్పన చేస్తామని తెలిపారు. ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. వివోఎలు పెద్ద సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.