Jul 31,2023 20:44

మదనపల్లె : నిరసన తెలుపుతున్న విఒఎలు

మదనపల్లె అర్బన్‌ ; విఒఎల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వెలుగు విఒఎ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పరంజ్యోతి డిమాండ్‌ చేశారు. సోమవారం తమ సమస్యలు పరిష్కరించాలంటూ పట్టణంలోని మిషన్‌ కాంపౌం డులో విఒఎలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పరంజ్యోతి, ఉపాధ్యక్షులు కృష్ణమ్మలు మాట్లాడుతూ విఒఎలు మూడేళ్ల కాలపరిమితి సర్కులర్‌ 64ను రద్దు చేయాలన్నారు. ప్రజా సంకల్పయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి విఒఎల అండగా ఉంటామని చెప్పి, ప్రస్తుతం వారిని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల వల్ల 2000 సంవత్సరం నుండి సెర్ప్‌ ద్వారా పనిచేస్తున్న 38 వేల మంది వీధిన పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. యాపులు భారాన్ని తగ్గించాలని, 5జి కనెక్టివిటీ సిమ్ములు, ట్యాబులు ఇవ్వాలన్నారు. సిసి, ఎసిల ఒత్తిళ్ల తగ్గించాలని, లక్ష్యాలను నిర్దేశించి వేధించడం సమంజసం కాదన్నారు. సిబిజిహెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలన్నారు. రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని తెలిపారు. విఒఎల మెర్జ్‌ ఆపాలని, అన్ని రకాల బకా యిలు చెల్లించాలని, లోకో యాప్‌ వర్క్‌ కోసం 5జి మొబైల్‌ ఫోన్లు ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఒఎలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెడ్డెప్ప రెడ్డి, జిల్లా అధ్యక్షులు రాణి, జిల్లా కోశాధికారి సుబ్రహ్మణ్యం, మండల ఉపాధ్యక్షులు శ్వేత, కార్యదర్శి దివ్య జ్యోతి, కోశాధికారి సుమతి, విఒఎలు పాల్గొన్నారు. నిమ్మనపల్లి: విఒఎల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ వెలుగు విఒఎల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణమ్మ, కార్యదర్శి రెడ్డప్ప, కోశాధికారి పరంజ్యోతి, జిల్లా అధ్యక్షులు రాణి ఆధ్వర్యంలో జీపు జాతా కార్యక్రమాన్ని సోమవారం నిమ్మనపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్వాక్రా మహిళా సంఘాలలో విఒఎలుగా పనిచేస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సుబ్రహ్మణ్యం, విఒఎలు రాధా, నరేంద్ర, రెడ్డి ప్రసాద్‌, రెడ్డప్ప, జ్ఞానేశ్వరి పాల్గొన్నారు.