Aug 30,2023 00:29

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు మట్ల వాణిశ్రీ

సిఐటియు జిల్లా అధ్యక్షులు మట్ల వాణిశ్రీ
ప్రజాశక్తి-రంపచోడవరం

రంపచోడవరం డివిజన్‌లోని విఒఎల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా అధ్యక్షులు మట్ల వాణిశ్రీ డిమాండ్‌ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఏడు మండలాల విఒఎల యూనియన్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం రామకృష్ణ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా వాణిశ్రీ మాట్లాడుతూ వెలుగు విఒఎలకు పనిభారం పెరిగిందని, అధికార పార్టీ నాయకుల వేధింపులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. విలీనం పేరుతో ఏడు మండలాల పరిధిలో సుమారు 50 మందికి పైనే వర్కర్లను పనిలో లేకుండా చేశారన్నారు. ఏడు మండలాల పరిధిలో చాలా మంది వర్కర్లకు వేతనాలు బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రంపచోడవరం ఎపిఒ విఒఎల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, ఉన్నతాధికారులు వెంటనే ఎపిఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విఒఎల సమస్యలపై రాష్ట్ర యూనియన్‌ పిలుపు మేరకు సెప్టెంబర్‌ 5న మండల కేంద్రాల్లోనూ, 18న డివిజన్‌ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అందులో విఒఎలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్‌ జిల్లా నాయకులు చంద్రశేఖర్‌, నరసింహ, సత్యనారాయణ, జగన్‌, బషీరమ్మ తదితరులు పాల్గొన్నారు.