ప్రజాశక్తి- కంచిలి: విలేజ్ ఆర్గనైజేషన్ ఏజెంట్లు (విఒఎ)ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కంచిలి మార్కెట్ యార్డు ఆవరణలో ఆదివారం నిర్వహించిన క్లస్టర్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వెలుగు సంస్థలో పని చేస్తున్న విఒఎలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిబిఒ, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. అన్ని రకాల బకాయిలు చెల్లించాలన్నారు. విఒఎల ఉపాధిని దెబ్బతీసే మూడేళ్ల కాలపరిమితి సర్యూలర్ రద్దు చేయాలన్నారు. సంఘాలను విడగొట్టడం, కలపడం లాంటి పనులు సెర్చ్ అధికారులే చేయడం సరైనది కాదని అన్నారు. వయసు పైబడిన వారికి, అనారోగ్యంతో ఉన్న వారికి కుటుంబ సభ్యులకు విఒఎలుగా అవకాశం కల్పించాలి. జెండర్, వయసు, చదువు పేరుతో తొలగింపులు ఆపాలన్నారు. వేతనాల చెల్లింపు చెక్కులపై సిసి, ఎపిఎం సంతకాలు లేకుండా చూడాలన్నారు. రికవరీ పేరుతో వేతనాల కోత విధించడం సరికాదన్నారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు జి.అశిరినాయుడు, జిల్లా కోశాధికారి ఎ.దుర్గ, సిఐటియు మండల నాయకులు ఎస్.లక్ష్మీనారాయణ, ప్రభావతి, ధనలక్ష్మి, రాజేశ్వరి, ద్రౌపతి, తోయిజాక్షి, నిర్మల లోకనాథం, మోహనరావు, యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.ధనలక్ష్మి, జి.అరుణ తదితరులు పాల్గొన్నారు.










