ప్రజాశక్తి - రంపచోడవరం
వెలుగు విఒఎల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మట్ల వాణిశ్రీ, పల్లపు వెంకట్ డిమాండ్ చేశారు. ఎఎస్‌ఆర్ రంప చోడవరం జిల్లా 11 మండలాల పరిధిలోని వెలుగు యానిమేటర్ల యూనియన్ జిల్లా మహాసభలు మంగళవారం జరిగాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వాణిశ్రీ, వెంకట్ మాట్లాడుతూ విఒఎలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. 10 గ్రూపుల కంటే తక్కువ ఉంటే వాళ్ళని తొలగిస్తామని బెదిరించడం సరైనది కాదన్నారు. గ్రూపుల సంఖ్యతో నిమిత్తం లేకుండా జీతాలు చెల్లించాలని, విఒఏలపై రాజకీయ వేధింపులు ఆపాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ వివోఏలు పాత్ర, వెలుగులో చాలా కీలకమైనదని, ప్రభుత్వం పథకాలు, స్కీములు, ఇతర లోన్లు వంటివి గిరిజనులకు అందించే వివోఏలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వివోఏల పోరాటాలకు పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నామని చెప్పారు.
నూతన జిల్లా కమిటీ ఎన్నిక
అనంతరం యూనియన్ జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్ష కార్యదర్శులుగా వి.లక్ష్యయ్య, ఎ.రామకృష్ణ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బషీర్ ఉన్నిసా, భాస్కర్, కన్నబాబు, జగన్, సహాయ కార్యదర్శులుగా సత్యనారాయణ, చందు, చినతల్లి, గెడ్డం శ్రీను, 25 మంది కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అధ్యక్షులు సాదల విద్య సాగర్ రెడ్డి, కార్యదర్శి తీగల శ్రీనివాస్, వివోఏల సంఘం నాయకులు బసీర్, గొర్లె జగన్నాథరావు, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










