Nov 13,2022 23:24

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌
ప్రజాశక్తి- చింతూరు

వెలుగు డిపార్టుమెంట్‌లో పని చేస్తున్న విఒఎలకు 10 నుండి 15 నెలల పాటు పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ డిమాండ్‌ చేశారు. 3 సంవత్సరాలు పని చేసిన విఒఎలను ఇంటికి పంపించే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చి కాల పరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలని కోరారు. ఆదివారం చింతూరులో జరిగిన వెలుగు యానిమేటర్స్‌ (విఒఎ)ల మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విఒఎల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. 9 నుండి 15లోపు గ్రూప్‌లు వున్న విఒఎలకు వేతనాలు నిలుపుదల చేసిందని, కాని జీతాలు ఇవ్వకుండా వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటుందని విమర్శించారు. ప్రతి మండలంలో 25 శాతం విఒఎలు జీతాలు లేకుండా విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఇచ్చిన వేతనాలు కూడా చాలా తక్కువ అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, 3 ఏళ్ళ కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలని, కనీసం వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రూప్‌ల సంఖ్యతో నిమిత్తం లేకుండా అందరికి వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం నూతన కమిటీని 12 మందితో ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా రత్నకుమారి, లక్ష్మయ్య ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో బుచ్చయ్య, లీలా, సుహాసిని, వాణి, జయలక్ష్మి, రాధ, రాణి తదితరులు పాల్గొన్నారు.