Oct 29,2023 23:04

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ

బెలగాం: విఒఎల కాల పరిమితి సర్క్యులర్‌ రద్దు చేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని సిఐటియు రాష్ట్రకార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో విఒఎ సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ విఒఎలతో రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, మెర్జ్‌ ఆపాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని, లోకో యాప్‌ వర్క్‌ కోసం 5జి మొబైల్‌ ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వాలంటరీ ఐడితో విఒఎతో పని చేయించరాదన్నారు. 15 సంఘాల్లోపు ఉన్న విఒఎలకు వేతనాలు చెల్లించాలని, విఒఎల కుదింపు వల్ల ఉపాధి కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. మహిళ మార్టుల్లో సరుకులు, విత్తనాలు, గొర్రెలు, మేకలు, కోళ్లు, గేదెలు వంటివి పొదుపు సంఘాల మహిళలతో బలవంతంగా పంపించే పద్ధతిని ఆపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో విఒఎ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధర్మారావు, వి.సుందరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర, కోశాధికారి జి.వెంకటరమణ పలువురు విఒఎలు పాల్గొన్నారు.