ప్రజాశక్తి -అనకాపల్లి : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద విఒఎ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాతో కలెక్టరేట్ దద్దరిల్లింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వివి శ్రీనివాసరావు, అధ్యక్షురాలు సిహెచ్ రూపాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ విఒఎల మూడు సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, ఉపాధికి నష్టం కలిగించే విలీన విధానాన్ని ఉపసంహరించాలని, అన్ని రకాల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.15 సంఘాల లోపు ఉన్న విఒఎ ఫ్రీజింగ్ తొలగించి, తక్షణమే వేతనాలు విడుదల చేయాలన్నారు. సాంకేతిక కారణాలతో నిలుపుదల చేసిన 1500 మంది వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు. 2019 నుంచి రిజిస్ట్రేషన్ చేసిన, చేయని విఒల్ల్లో పనిచేస్తున్న విఎఒల బకాయిలు చెల్లించాలన్నారు. జెండర్, చదువు, వయస్సు పేరుతో విఒఎల తొలగింపును విరమించుకోవాలన్నారు. గ్రామ సంఘం తీర్మానం లేకుండా తొలగించిన విఒఎలను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, తొలగించిన అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.రూ.10 లక్షలకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న విఒఎలు పాల్గొన్నారు.










