
ప్రజాశక్తి -నక్కపల్లి:వెలుగు యానిమేటర్లు (విఓఏ)లు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన బాట పట్టారు. సోమవారం వెలుగు కార్యాలయం వద్ద తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్.ఆర్ పాలసీ అమలు, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్, విఓ ల మెర్జ్ అపాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని విఒఎలు డిమాండ్ చేశారు. లోకో యాప్ వర్క్ కోసం 5 జి మొబైల్ ప్రభుత్వమే ఇవ్వాలని, 15 సంఘాల లోపు ఉన్న విఓఏ లకు వేతనాలు చెల్లించి, మెర్జ్‌తో ఉపాధి కోల్పోయిన విఓఏ లకు నష్ట పరిహారం చెల్లించాలని, వయస్సు, చదువు, జెండర్ పేరుతో విఓఏల తొలగింపు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు సూర్యనారాయణ, కార్యదర్శి సత్యనారాయణ, వరలక్ష్మీ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
కోటవురట్ల:మండల కేంద్రంలో వెలుగు కార్యాలయం వద్ద సోమవారం వెలుగు వివోఏలు ధర్నా నిర్వహించారు. వయసు, చదువు, జెండర్ పేరుతో తొలగించడం సరికాదని విఒఎలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు మాణిక్యం మాట్లాడుతూ, ఉద్యోగ భద్రత కల్పించాలని, 15 సంఘాలు ఉన్న వివోఏలకు సైతం వేతనాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రవణమ్మ, వివోఏలు పాల్గొన్నారు.
పరవాడ :వెలుగు విఒఎల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక వెలుగు కార్యాలయం ఎదుట వివోఏలు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వివోఏ సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ఎం ఉమా, పి.రమ మాట్లాడుతూ కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 15 సంఘాల లోపు ఉన్న వివోఏల వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, వెంకటలక్ష్మి, నీలిమ, నాగమణి, పైడి లక్ష్మి, విజయ పాల్గొన్నారు.