అతనో సైంటిస్టు. ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలేసి సొంతూరికి సేవ చేయాలని సంకల్పించుకున్నారు. వినూత్న పద్ధతిలో విద్య నేర్పుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అతనే జార్ఖండ్‌కు చెందిన 35 ఏళ్ల మహ్మద్ సాజిద్ హుస్సేన్. 2019లో 'బెస్ట్ ఇన్నోవేటివ్ ఐడియా స్కూల్ అవార్డు' ను సొంతం చేసుకున్నారాయన. 'స్కూలేసియం' పద్ధతి ద్వారా విద్య నేర్పుతున్న సాజిద్ గురించి మరెన్నో విశేషాలు..
సాజిద్‌ది జార్ఖండ్‌లోని చితార్‌పూర్ గ్రామం. ఆయన మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చదివాక పిహెచ్‌డి జర్మనీలో చేశారు. 2012లో ఇండియాకు తిరిగొచ్చి, నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ (NAL) లో ఉన్నతోద్యోగాన్ని సంపాదించారు. 'అప్పుడే ఒక విషయం తెలిసింది. మా ఊర్లో నాతో చదువుకున్న వారిలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు అరుదుగా ఉన్నారని, ఎక్కువమంది నామకావాస్తి ఉద్యోగాల్తో జీవితాన్ని గడుపుతున్నారని గుర్తించాను. అది నన్నెంతో బాధించింది. ఉన్నతశ్రేణికి చెందిన విద్యార్థులు హైటెక్ విద్యా సౌకర్యాలను పొందుతారు. కాబట్టి వారు ఉన్నత స్థాయిలో నిలుస్తారు. అదే పేద విద్యార్థులు కనీస మౌలిక వసతులు కూడా లేక చదువును మధ్యలోనే ఆపేస్తారు. ఈ విధానాన్ని నేను మార్చాలి అనుకున్నా' అంటున్నారు సాజిద్.
స్కూలేసియం సృష్టి ఇలా..
'NAL లో సైంటిస్ట్‌గా ఉన్న సమయంలోనే మెరుగైన విద్య ద్వారా వందలాది మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను అందించాలి అనుకున్నా. 2015లో ఉద్యోగాన్ని వదిలి, సొంతూరు చేరుకున్నా. 'స్కూలేసియం' స్థాపించాను. స్కూల్, జిమ్నాసియం పదాలను కలిపి 'స్కూలేసియం' అని పేరు పెట్టా. శారీరక వ్యాయామం చేస్తే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అదే విధంగా విద్యార్థులు తమ మెదడులను ప్రాక్టికల్ పాఠాల ద్వారా వ్యాయామం చేయాలని నేను నమ్ముతున్నాను. ఈ టీచింగ్ మెథడాలజీని మేకర్ ఓరియంటెడ్ పెడగోజీ (వీఉూ) అని పిలుస్తారు. ఇందులో జీవిత పాఠాల ద్వారా పిల్లలకు విద్యను బోధిస్తారు. పాఠశాల అనేది విద్యార్థులకు ఒక ల్యాబ్‌లాంటిది. పాఠాల్లో ఉండే ప్రతి విషయాన్ని పరిశోధనల ద్వారా తెలపాలి అనేది నా అభిమతం. ఈ పద్ధతిలో పుస్తకాలు మోత ఉండదు. హోం వర్క్‌ల బాధ ఉండదు. సేంద్రీయ వ్యవసాయాన్నీ విద్యార్థులకు నేర్పుతున్నా. పంటను ఎలా పండించాలి? అనేది స్వయంగా వారు నేర్చుకుంటారు. కాబట్టి ఆ విధానాన్ని ఎన్నడూ మరిచిపోరు. ఇందుకుగాను ప్రతి తల్లిదండ్రీ పాఠశాలకు నెలకు రూ.500 పీజు చెల్లిస్తారు. ఎవరైనా చెల్లించలేకపోతే వారి ఫీజును మాఫీ చేస్తాను. ఈ విద్యా విధానాన్ని ప్రభుత్వమూ ప్రోత్సహిస్తోంది. ప్రయోగశాలలు ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగం కొంత నిధులను కేటాయించింది. ఇప్పటి వరకు 85 గ్రామాల నుంచి 26,618 మంది పిల్లలు 'స్కూలేషియం' పద్ధతిలో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పద్ధతిలో పాఠాలను బోధించడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులూ ముందుకు రావడం సంతోషించే విషయం' అంటున్నారు సాజిద్.
'21వ శతాబ్దపు పిల్లలకు పాత పద్ధతిలో పాఠాలు చెబితే సరిపోదు. నేడు రోబోలు మార్కెట్‌లోకి వచ్చాయి. కాబట్టి మనుషుల ఉద్యోగ స్వభావం మారిపోతోంది. రోబోల ముందు మనుషులు ఎక్కడ సరిపోతారు అనేది పెద్ద ప్రశ్న? రాబోవు రోజుల్లో టెక్నాలజీ పరంగా పెద్ద మార్పు జరగబోతోంది. ఇంట్లోనే కూర్చుని ఉద్యోగాలు చేసే రోజులు వస్తున్నాయి. రాబోయే 15-20 సంవత్సరాలలో పిల్లలు ఎలాంటి విద్యను అభ్యసిస్తే ప్రయోజనాలు పొందుతారు అనేది పరిశోధన చేస్తున్నా' అంటున్నారు సాజిద్.
అట్టడుగు వర్గాలకు నిచ్చెన
'మా తల్లిదండ్రులు ఒక ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు 'స్కూలేసియం' గురించి తెలుసుకున్నారు. మూడో తరగతి నుంచి ఈ పద్ధతిలోనే చదువుతున్నా. మా నాన్న మెకానిక్. నెలవారీ ట్యూషన్ ఫీజులూ కట్టలేకపోతే సాజిద్ సారే నా విద్యా ఖర్చులను భరించారు. చాలా పాఠశాలల్లో మార్కులే ప్రాముఖ్యతగా బోధన చేస్తూ ఉంటారు. అది సరికాదు. ఈ విధానం ద్వారా జీవితంలో ఎలాగైనా రాణించగలం అనే ధైర్యం వచ్చింది. మాలాంటి అట్టడుగు వర్గాల ప్రజలకు ఈ విద్యా విధానం ఒక నిచ్చెనలాంటిది' అంటోంది పదో తరగతి చదివే శిఖా కుమారి.
'ఒకసారి ఎండాకాలంలో విపరీతమైన ఉక్కపోత. మా స్కూల్లో విద్యార్థులు బ్లేడ్లు, బ్యాటరీ, మోటార్ల సహాయంతో ఫ్యాన్‌ను తయారుచేశారు. ఇది మచ్చుకు ఒకటి మాత్రమే. ఇలాంటివి ఎన్నో' అంటున్నారు ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్.
వినూత్న పద్ధతిలో విద్య నేర్పుతూ ఎందరినో ఉన్నత స్థాయిలో నిలబెడుతున్న సాజిద్‌కు సలాం.