Jun 28,2023 00:41

ప్రజాశక్తి - వినుకొండ : వినుకొండ పురపాలక సంఘం పరిధిలో జరిగేవన్ని అనధికారికమేనని, తమకు గది ఏర్పాటుకు మాత్రం నిబంధనలా? అని 8వ వార్డు కౌన్సిలర్‌ పాపసాని బ్రహ్మయ్య అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ కౌన్సిల్‌ హాల్లో జరిగిన సాధారణ సమావేశంలో అజెండాలోని 32 అంశాలను కౌన్సిల్‌ తీర్మానం చేశారు. అనంతరం కౌన్సిలర్‌ బ్రహ్మయ్య మాట్లాడుతూ వివిధ పనులు నిమిత్తం మునిసిపల్‌ కార్యాలయానికి వచ్చిన వార్డు కౌన్సిలర్లు వేచి ఉండటానికి గది లేదని, దాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యాలయానికి వచ్చిన కౌన్సిలర్లు చెట్ల కింద, వాటర్‌ ట్యాంకులు కింద, గార్డెన్లో ఉండాలా? అని ప్రశ్నించారు. అయితే అధికారికంగా గది ఏమీ ఉండదని కమిషనర్‌ బదులిచ్చారు. వీలున్నంత వరకు ఆ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ గ్రౌండ్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని, తమ వార్డు పట్ల వివక్షత ఇవ్వకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని 7వ వార్డ్‌ కౌన్సిలర్‌ కోరారు. ఐదవ వార్డులో వీధిలైట్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కౌన్సిలర్‌ అంజలీదేవి చెప్పారు. 21వ వార్డు కౌన్సిలర్‌ బాష మాట్లాడుతూ పారిశుధ్య మెరుగు చర్యలు చేపట్టాలన్నారు. సభ్యులు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరిస్తామని చైర్మన్‌ డాక్టర్‌ దస్తగిరి హామీనిచ్చారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్‌ వెంకయ్యను కౌన్సిల్‌ సభ్యులు ఘనంగా సన్మానించారు.