Jul 27,2023 23:31

ప్రజాశక్తి - వినుకొండ : అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి శ్రేణులు ఎదురెదురుగా ఘర్షణకు దిగడం, పోలీసుల లాఠీఛార్జీ, గాలిలోకి కాల్పులతో పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ కేంద్రం గురువారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే అయిన బొల్లా బ్రహ్మనాయుడు తన డెయిరీ ఫారానికి మట్టిని అక్రమంగా తరలించారనే అంశంపై టిడిపి ఇటీవల ఆందోళన చేపట్టింది. అయితే తన డెయిరీ ఫారంలోకి టిడిపి శ్రేణులు వచ్చి సామగ్రిని దొంగిలించారని ఎమ్మెల్యే ఫిర్యాదుతో టిడిపి జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులుతోపాటు మరికొందరిపై కేసు నమోదైంది. ఈ కేసులకు నిరసనగా టిడిపి శ్రేణులు గురువారం ఉదయం 10.30 గంటలప్పుడు వినుకొండ పట్టణంలో ప్రదర్శన చేపట్టారు. అదే సమయంలో బొల్లాపల్లి మండలం వడ్డేగుంటలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొని వస్తున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఆర్‌సిఎం చర్చి జీవాలయం ఎదుటకు రాగానే టిడిపి శ్రేణులు ఎదురు పడ్డాయి. దీంతో ఎమ్మెల్యే తన కారులో నుండే టిడిపి శ్రేణులను దుర్భాషలాడ్డంతో వారు ఎమ్మెల్యే కారును చుట్టుముట్టారు. అప్పుడు మొదలైన ఉద్రికత్తత మధ్యాహ్నం 1.15 గంట వరకూ కొనసాగింది. చివరికి పట్టణంలో 144 సెక్షన్‌ను విధించారు. బస్టాండ్‌ ఎదుట టిడిపి శ్రేణులపై వైసిపి శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడికి దిగగా టిడిపి శ్రేణులూ కొబ్బరి బోండం చిప్పలు, సీసాలతో ప్రతిదాడి చేశారు. వైసిపి శ్రేణుల దాడిని తట్టుకోలేని పలువురు టిడిపి కార్యకర్తలు పరుగులు తీశారు. ఘర్షణలో టిడిపికి చెందిన గంగినేని అంజయ్య, తూమాటి చిన్నకాశీశ్వరరావు, గుంటకల వీరాంజనేయులు, చింత గంగయ్య, బాల శ్రీనివాసరావు గాయపడగా వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. మరోవైపు పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు తొలుత లాఠీఛార్జీ చేసి ఇరు పక్షాలను చెదరగొట్టారు. అయినా పరిస్థితి అదుపుఓకి రాకపోవడంతో వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు గాలిలోకి ఒక రౌండ్‌ కాల్పులు జరిపారు. టిడిపి శ్రేణులంతా ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలోకి పరుగులు తీయగా వైసిపి గ్రూపు మళ్లీ దాడికి దిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పట్టణ సిఐతోపాటు రూరల్‌ సిఐ ప్రసాద్‌, ఐదు మండలాల ఎస్‌లు, సిబ్బంది రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా క్షతగాత్రులను టిడిపి జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు పరామర్శించారు. ఎమ్మెల్యే అవినీతిని బహిర్గతం చేస్తున్నందుకే తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, వాఇని నిరసించినందుకు మారణాయుధాలతో దాడి చేశారని మండిపడ్డారు.