Jun 29,2023 22:30

ప్రజాశక్తి - వినుకొండ : తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండ కొండపై శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం వేడుకలు నిర్వహించారు. గతేడాది నూతనంగా ఏర్పాటు చేసిన ఘాట్‌ రోడ్డు మార్గాన వేలాది మంది సందర్శకులు వచ్చారు. సీత జాడ విన్న కొండగా ప్రసిద్ధికెక్కిన వినుకొండ తిరుణాళ్లను చూడ్డానికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా ప్రజల తరలివచ్చారు. వేడుకల్లో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు పాల్గొ న్నారు. ఏర్పాట్లను దేవదాయ, మున్సిపల్‌, పోలీస్‌ శాఖాధికారులు పర్యవేక్షించారు.
మొరాయించిన ఆర్టీసీ బస్సులు..
తిరునాళ్ల సందర్భంగా కొండపైకి వినుకొండ ఆర్‌టిసి డిపో బస్సు సౌకర్యం కల్పించింది. కొండపై ఘాట్‌ రోడ్డు బస్సు రాకపోకలకు అనుకూలంగా లేకపోయినా అధికార పార్టీ వత్తిడితే సర్వీసులను నడిపారు. 30 బస్సులను ఏర్పాటు చేసి నడపగా అధిక శాతం బస్సులు ఘాట్‌రోడ్డు ఎగువలో ఎక్కలేక మొరాయించాయి. కింద నుంచి అతి కష్టంపై వెళ్లిన ఆర్టీసీ బస్సులు మూడో మలుపు ఎగమూరు వద్దకు వెళ్లగానే పికప్‌ డౌన్‌ అయ్యి ఎక్కలేక కండెన్సర్ల నుండి పొగలు వచ్చి బస్సులు నిలిచిపోయాయి. అక్కడి నుండి ప్రయా ణికుల్ని కిందకు దించి పంపించారు. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరి వద్ద నుండి టిక్కెట్‌కు రూ.40 వసూలు చేసి మధ్యలో దింపేయడం ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు ఘాట్‌ రోడ్డు మధ్యలో నిలిచిపోయిన బస్సులను సురక్షితంగా కిందకు పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది అవస్థ పడ్డారు. ఇదిలా ఉండగా వినుకొండ ఘాట్‌ రోడ్‌ నుండి కొండపైకి ఆర్టీసీ బస్సు టిక్కెట్‌ రూ.40 తీసుకోవడం, దానిపై కొటప్పకొండ టు వినుకొండ అని ఉండడం విమర్శలకు గురైంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కొందరన్నారు.
సదుపాయాల కల్పనలో విఫలం
సందర్శకులకు కల్పించాల్సిన సదుపా యాలపై జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, దేవాదాయ అసిస్టె ంట్‌ కమిషనర్‌ తదితరులు రెండ్రోజులుగా పర్యటించి పలు సూచనలు చేశారు. అయితే వాటి అమలులో సంబంధిత శాఖాధికారులు తీవ్రంగా విఫలమయ్యారు. ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సులు, కార్లు ద్విచక్ర వాహనాల రాకపోకలతో రద్దీ ఏర్పడి నడిచేవారికి ఇబ్బంది కరంగా మారింది. కొంతమంది రాళ్లపైనుండి ప్రమాదకర స్థితిలో పాక్కుంటూ వెళ్లారు. పలువురు జారిపడ్డారు. దర్శనం వద్ద క్యూలోనూ తోపులాట తలెత్తింది. ఆర్టీసీ బస్సులు ఎగమూరు వద్ద కండెన్సర్లు కాలి పొగలు రావడంతో ప్రయాణికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.