Aug 21,2023 23:17

ప్రజాశక్తి-కాకినాడ జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో అందిన వినతులపై ప్రత్యేకంగా దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్‌ కార్యాలయం, స్పందన సమావేశ మందిరంలో జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టరు ఎస్‌.ఇలక్కియ, డిఆర్‌ఒ కె.శ్రీధర్‌ రెడ్డి, ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి డిఎస్‌ సునీతతో కలిసి కలెక్టర్‌ హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, పరిష్కరించవలసిందిగా ఆయా శాఖల అధికారులను కలెక్టరు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం 366 అర్జీలు వచ్చాయి.