Jul 17,2023 21:40

కలెక్టర్‌ నిశాంత్‌కు సమస్యను వివరిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు

ప్రజాశక్తి-పార్వతీపురం :   జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జెసి ఆర్‌.గోవిందరావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌, డిఆర్‌ఒ జల్లేపల్లి వెంకటరావుతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అధికంగా వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు పరిష్కరించాలని పలువురు వినతులను అందజేశారు. వాటిలో కొన్ని...
కురుపాం మండలం నేరేడువలస గ్రామంలో ఎయిడెడ్‌ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని, దీనిని ప్రభుత్వ పాఠశాలగా మార్చాలని, లేకుంటే టీచర్లను అయినా నియమించాలని బిడ్డిక బుల్లయ్య, గ్రామస్తులు దరఖాస్తు అందజేశారు.
సాలూరు మండలంలోని గిరిశిఖర గ్రామం మారయ్యపాడుకు రహదారి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని, తాడిలోవ నుంచి మారయ్యపాడు వరకు తారురోడ్డు మంజూరు చేయాలని సర్పంచ్‌ రామ్మూర్తి, గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.
సెంటర్‌ డివైడర్‌ నిర్మించాలని వినతి
బెలగాం నుండి వైకెఎం కాలనీ వరకు మెయిన్‌ రోడ్డులో సెంటర్‌ డివైడర్‌ను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని జనసేన జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్‌.. కలెక్టర్‌కు వినతి అందించారు. రోడ్డుకు ఇరువైపులా కొంతమంది వ్యాపారులు ఆక్రమణలకు పాల్పడటంతో రహదారి ఇరుకుగా మారి ప్రమాదాలకు మరింత కారణమవుతోందని వివరించారు. వెంకంపేట గోలీల వద్ద జరిగిన ఆక్రమణలు తొలగించాలని కోరారు.
పార్వతీపురం మండలం విశ్వంబరపురం గ్రామానికి చెందిన బి.భాస్కరరావు.. సర్వే నంబర్‌ 230, 229లో ఉన్న ప్రభుత్వ భూమి 30 సంవత్సరాలుగా తన సాగులో ఉందని, డి-పట్టా మంజూరు చేయాలని కోరారు. నర్సిపురం గ్రామ రైతులు విశ్వంభరపురం పంచాయతీలో తమ తల్లిదండ్రుల పేర్లతో డి-పట్టా భూములు ఉన్నాయని, వారు మరణించి నందున ఆ భూములను తమ పేరిట మార్చాలని అర్జీ అందజేశారు. కొత్తవలస రైతులు 25 ఏళ్లుగా తాము చేస్తున్న బంజరు భూములకు డిపట్టాలు మంజూరు చేయాలని కోరారు.
గరుగుబిల్లి మండలం దత్తివలస గ్రామానికి చెందిన గంటా రాములమ్మ తనకు కొత్త రేషన్‌ కార్డు మంజూరు చేయకపోవడంతో ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదని ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ పి.కిరణ్‌కుమార్‌, డిఎంహెచ్‌ఒ బి.జగన్నాథరావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ జిల్లా ఇంజినీరింగ్‌ అధికారి ఒ.ప్రభాకర రావు, డిపిఒ బి.సత్యనారాయణ, జిల్లా సప్లయి అధికారి సూర్యారావు, డిఇఒ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.విజయ గౌరి, జిల్లా ప్రణాళిక అధికారి పి.వీరరాజు, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం.డి.గయాజుద్దీన్‌, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నిత్యావసరాల ధరలను అదుపు చేయాలని సిపిఎం వినతి
నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను అదుపుచేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ఆధ్వర్యాన స్పందనలో కలెక్టర్‌కు వినతి అందించారు. ధరలను అదుపు చేయటానికి అన్ని రాజకీయ పార్టీలు, వ్యాపార సంస్థలతో ఫుడ్‌ కమిటీలు, విజిలెన్స్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. రైతు బజారు, చౌక ధరల డిపోల ద్వారా కూరగాయలు, నిత్యావసరాలు సబ్సిడీ ధరలకే ప్రజలకు అందించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు వి.ఇందిర, పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ పాల్గొన్నారు.
ఎపిడి సత్యంనాయుడుపై దర్యాప్తు చేపట్టాలి
ఐటిడిఎలో వైకెపి ఎపిడి వై.సత్యంనాయుడు పనిచేసిన మూడేళ్లలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేయాలని సిపిఎం, గిరిజన సంఘం ఆధ్వర్యాన స్పందనలో జెసి గోవిందరావుకు వినతి అందించారు. సుమారు రూ.2 కోట్ల నిధులు ఏమయ్యోయని తెలియని పరిస్థితి నెలకొందన్నారు. వీటిపై దర్యాప్తు చేసి, గిరిజనులకు న్యాయాలని చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, గిరిజన సంఘం జిల్లా నాయకులు హెచ్‌.రామారావు కోరారు.