May 11,2023 20:40

మాట్లాడుతున్న నారా లోకేష్‌
వినతులు స్వీకరిస్తున్న నారా లోకేష్‌
వినతులు స్వీకరిస్తున్న నారా లోకేష్‌

వినతుల వెల్లువ
- దారిపొడవున ఆత్మీయ స్వాగతం
- నందికొట్కూరు నియోజకవర్గంలో యువగళం
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి/నందికొట్కూరు

    టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 96వ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా వివిధ గ్రామాల ప్రజలు లోకేష్‌కు స్వాగతం పలికి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. నందికొట్కూరు శివారు క్యాంప్‌ సైట్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర తార్టూరు, మండ్లెం, తంగడంచ, జూపాడు బంగ్లా, తాటిపాడు, తరిగొప్పుల క్రాస్‌ మీదుగా బన్నూరు చేరుకుంది. మండ్లెం గ్రామంలో సాగునీటి కోసం జలదీక్ష చేస్తున్న గ్రామ రైతులకు యువనేత నారా లోకేష్‌ సంఘీభావం తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మండ్లెం ప్రాంతంలో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, సాగునీటి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మధ్యాహ్నం తంగడంచ వద్ద భోజన విరామ సమయంలో బిసిలతో సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. తంగడంచ వద్ద గత ప్రభుత్వ హయాంలో భూములు కేటాయించిన జైన్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు వద్ద సెల్ఫీ దిగిన లోకేష్‌... వేలాది మందికి ఉపాధి కల్పించే ఆ ప్రాజెక్టు జగన్‌ రెడ్డి ప్రభుత్వ ప్రోత్సాహం లేక వెళ్లిపోయిందని చెప్పారు. పాదయాత్ర దారిలో యాదవులు, రైతులు, బిసిలు యువనేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.
విధ్వంసక పాలనకు సజీవసాక్షి జైన్‌ ఇరిగేషన్‌
తంగెడంచ వద్ద నిలిచిపోయిన జైన్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు వద్ద సెల్ఫీ దిగిన లోకేష్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విధ్వంసక పాలకుడు, జగన్‌ వినాశక చర్యలకు ప్రత్యక్షసాక్షి నందికొట్కూరు నియోజకవర్గం తంగెడంచలో నిలచిపోయిన జైన్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అని తెలిపారు. రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు అందించడంతోపాటు కరువు సీమలో యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో చంద్రబాబు గారి ఆహ్వానం మేరకు అప్పట్లో స్వర్గీయ భవర్‌ లాల్‌ జైన్‌ తంగెడంచలో ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు వచ్చారన్నారు. గత ప్రభుత్వంలో ఇందుకోసం 623 ఎకరాల భూమి కూడా కేటాయించారని, అనుకున్న ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర రైతాంగం జీవన స్థితిగతులు మారిపోయేవని పేర్కొన్నారు. జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సహకారం లేకపోవడంతో జైన్‌ ప్రాజెక్టు నిలచిపోయిందన్నారు. పాదయాత్రలో మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, భూమా అఖిల ప్రియ, టిడిపి జిల్లా ఇంఛార్జి గౌరు వెంకటరెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పార్వతమ్మ, నియోజకవర్గ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.