Nov 03,2023 21:06

సాగునీరు అందించాలని జెసికి వినతి పత్రం అందిస్తున్న రైతులు

ప్రజాశక్తి-వంగర :  ప్రజల నుంచి వచ్చిన వినతులను తక్షణమే స్పందించి పరిష్కరించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి 64 వినతులు స్వీకరించారు. తోటపల్లి ఆయకట్టుకు శివారున ఉన్న వంగర మండలంలోని భూములకు సాగునీరు తక్షణమే అందించి ఆదుకోవాలని మద్దివలస, ఎం.సీతారాంపురం గ్రామాల రైతులు ఐదు వినతులు అందించారు. నూతన గృహాలు మంజూరు చేయాలని 16 వినతులు వచ్చాయి. ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని 21 వినతులందాయి. మండలంలోని బంగారువలస - విశాఖపట్నం నైట్‌హాల్ట్‌ బస్సును పునరుద్ధరించాలని, వంగర మండలంలోని వివిధ గ్రామాలను కలుపుతూ రాజాంకు బస్సు సౌకర్యం కల్పించాలని రెండు వినతులు అందించారు. అమ్మఒడి పథకం నిధులు మంజూరు కావడం లేదని మూడు వినతులు వచ్చాయి. సిసి రోడ్లు, డ్రెయిన్లు నిర్మించాలని రెండు అర్జీలందాయి. అరసాడ పాఠశాలలో నాడు-నేడు పనులు చేసినప్పటికీ బిల్లులు అందలేదని విన్నవించారు. పశుసంవర్థక శాఖకు ఒకటి, ఐసిడిఎస్‌కు రెండు వినతులు వచ్చాయి. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ అశోక్‌.. తహశీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. రీసర్వేకి సంబంధించి డిటితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందు ఎంపిపి ఉత్తరావెల్లి సురేష్‌ ముఖర్జీ, వైసిపి మండల అధ్యక్షులు కరణం సుదర్శన రావు జెసిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వర రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి విటి రామారావు, పశుసంవర్థక శాఖ జెడి విశ్వేశ్వరరావు, వంగర మండల ప్రత్యేక అధికారి నూకరాజు, డ్వామా ఎపిడి ఎం.శ్రీనివాసరావు, ఎంపిడిఒ శశిభూషణరావు, డిటి బి.సుందరరావు తదితరులు పాల్గొన్నారు.