Nov 01,2023 21:21

గజపతినగరం సిపిఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరావుకు తిలకం దిద్దుతున్న మహిళ

విజయనగరం ప్రతినిధి : పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో 200 కిలోమీటర్ల మేర ప్రజారక్షణ భేరి సాగింది. యాత్రలో అడుగడుగునా ప్రజా, రైతు, కార్మిక, గిరిజన, ఉద్యోగుల సమస్యలపై విన్నపాలు అందాయి. నాడు టిడిపి, నేడు వైసిపి ప్రభుత్వాలు మోసం చేశాయంటూ భావోద్వేగంతో సిపిఎం నాయకుల ఎదుట మొరపెట్టుకున్నారు. చాలా మంది వినతిపత్రాలు అందజేయగా, ప్రసంగాలు విన్నాక, 'ఔను! మోసపోయాం' అంటూ తమ అనుభవాలు చెప్పుకొచ్చారు. సమస్యల చిట్టాలు అందుకున్న నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడిచేసి సమస్యలు పరిష్కారమయ్యే వరకూ పోరాడుతామని హామీ ఇచ్చారు. ఎర్రజెండా ఎప్పటికీ పేదలు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, ప్రజల పక్షానే పనిచేస్తుందని అభయమిచ్చారు.
ప్రజా రక్షణ భేరి బస్సుయాత్ర మూడో రోజు బుధవారం ఉదయం 10 గంటలకు గజపతినగరంలో ప్రారంభమైంది. గజపతినగరంలో పురిటిపెంట రోడ్డు నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు, తిరిగి గణేష్‌ కోవెల మీదుగా చంపావతి బ్రిడ్జి వరకు ప్రదర్శన సాగింది. అనంతరం బొండపల్లి మీదుగా గంట్యాడ మండల బుడతనాపల్లికి చేరింది. అక్కడ మధ్యాహ్న భోజన విరామం అనంతరం తామరాపల్లి మీదుగా శృంగవరపుకోట మండలం బొడ్డవర జంక్షన్‌ వరకు సాగింది. అనంతరం రాత్రికి అల్లూరి సీతారామ రాజు జిల్లా అనంతగిరి చేరింది. అన్నిచోట్లా మహిళలు.. సిపిఎం నాయకులకు హారతి పట్టి, తిలకం దిద్దారు. జనం డప్పుల చప్పుడుతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమస్యలపై వినతులు వెల్లువెత్తాయి. పోడు పట్టాలు ఇప్పించాలని, తమ గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలని బొడ్డవర జంక్షన్‌లో గిరిజనులు వినతులు అందజేశారు. జిందాల్‌ బాక్సైట్‌ శుద్ధి ఫ్యాక్టరీ పేరిట భూములు లాగేసుకుని 18 ఏళ్ళు గడుస్తున్నా ఏర్పాటు చేయలేదని, ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేశారని బాధిత గిరిజనులు వినతి అందజేశారు. గజపతినగరంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవనాలు ఏర్పాటు చేయాలని, గంట్యాడలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ బిసి హాస్టల్‌ భవనాలను పునర్నిర్మించాలని, మెస్‌ ఛార్జీలు పెంచాలని, పెండింగ్‌లో ఉన్న విద్యా, వసతి దీవెనల నిధులు విడుదల చేయాలని వినతులిచ్చారు. తాము గొర్రెలు మేపుతూ జీవనోపాధి పొందుతున్న కొండను కృషి విజ్ఞాన కేంద్రం పేరిట లాగేసుకుని పొట్ట కొట్టేందుకు పాలకులు ప్రయత్నం చేస్తున్నారంటూ దత్తిరాజేరు మండలం చినచామలాపల్లికి చెందినవారు వినతి అందజేశారు. అంగన్‌వాడీలు, భవన నిర్మాణ కార్మికులు, డప్పు కళాకారులు, రైతులు, ఉపాధి కూలీలు తమ సమస్యలపై వినతులందించారు. వీటిపై నాయకులు స్పందిస్తూ ప్రభుత్వంపై పోరాడి న్యాయం చేస్తామన్నారు. భేరి యాత్రలో భాగంగా శృంగవరపుకోట మండలం బొడ్డవర వద్ద 2006లో జిందాల్‌ బాక్సైట్‌ శుద్ధి కర్మాగారం కోసం కేటాయించిన భూములను, బుడతనాపల్లిలో ఎండిపోయిన వరి పొలాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ పరిశీలించారు.

విజయనగరం ప్రతినిధి : పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో 200 కిలోమీటర్ల మేర ప్రజారక్షణ భేరి సాగింది. యాత్రలో అడుగడుగునా ప్రజా, రైతు, కార్మిక, గిరిజన, ఉద్యోగుల సమస్యలపై విన్నపాలు అందాయి. నాడు టిడిపి, నేడు వైసిపి ప్రభుత్వాలు మోసం చేశాయంటూ భావోద్వేగంతో సిపిఎం నాయకుల ఎదుట మొరపెట్టుకున్నారు. చాలా మంది వినతిపత్రాలు అందజేయగా, ప్రసంగాలు విన్నాక, 'ఔను! మోసపోయాం' అంటూ తమ అనుభవాలు చెప్పుకొచ్చారు. సమస్యల చిట్టాలు అందుకున్న నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడిచేసి సమస్యలు పరిష్కారమయ్యే వరకూ పోరాడుతామని హామీ ఇచ్చారు. ఎర్రజెండా ఎప్పటికీ పేదలు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, ప్రజల పక్షానే పనిచేస్తుందని అభయమిచ్చారు.


గజపతినగరం, బుడతనాపల్లి, తామరాపల్లి, బొడ్డవర జంక్షన్లలో జరిగిన సభల్లో నాయకులు మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వర్షాభావం వల్ల జిల్లాలో వరిపంట ఎండిపోయిందని, ఇప్పటికే పంటనాశనమైన నేపథ్యంలో కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. లేదంటే రైతులను సమీకరించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతామని హెచ్చరించారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెదమానాపురం రైల్వే ఫ్లైఓవర్‌ పూర్తి చేయలేదన్నారు. తోటపల్లి గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్‌ పూర్తి చేసి 15 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన సిఎం జగన్మోహన్‌ రెడ్డికి మాట నిలబెట్టుకోవడం చేతకాలేదన్నారు. వైసిపి ప్రభుత్వం భూపంపిణీ పేరిట పేదల వద్ద ఉన్న అసైన్డ్‌ భూములను ఆక్రమణదారులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. మెంటాడ, పాచిపెంట మండలాల్లో దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చేదుకు మీనమేషాలు లెక్కిస్తోందని దుయ్యబట్టారు.

పిఎం నాయకుల ఎదుట మొరపెట్టుకున్నారు.


సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో ఇప్పటికీ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. అదానీ, అంబానీల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణలు తీసుకొస్తే, రాష్ట్రంలోని జగన్మోహన్‌రెడ్డి సర్కారు వాటిని అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. అందువల్లే విద్యుత్‌ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని, సామాన్యులపై పెనుభారం పడుతోందని విరుచుకుపడ్డారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సబ్బరావమ్మ, రాష్ట్ర నాయకులు హైమావతి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన చెందారు. స్కీమ్‌వర్కర్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ, పనికి తగ్గ వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.అశోక్‌ మాట్లాడుతూ వైసిపి, టిడిపితోపాటు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గిరిజనులకు తీరని ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. గిరిజన చట్టాల్లో మార్పుచేసి అభివృద్ధి పేరిట కొండలు, అడవుల నుంచి గిరిజనులను దూరం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలన్నీ మన రాష్ట్రంలో సిఎం జగన్మోహన్‌రెడ్డి పక్కాగా అమలు చేస్తున్నారని, దీనివల్ల అన్ని తరగతుల ప్రజానీకంపై భారాలు పడుతున్నాయని, వ్యవస్థలు నిర్వీర్యమౌతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేస్తానని గద్దెనెక్కిన ప్రధాని మోడీ నష్టదాయకమైన వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే వైసిపి, టిడిపి ఎమ్‌పిలంతా వంతపాడారని వివరించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, టిడిపి, జనసేన నాటకీయ రాజకీయాలు ప్రజలకు వివరించి, ఆయా పార్టీల నుంచి రక్షించేందుకే సిపిఎం ఆధ్వర్యాన ప్రజారక్షణ భేరి.. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నామన్నారు. ఈ నెల 15న విజయవాడలో జరిగే బహిరంగ సభకు తరలిరావాలని, ప్రజా సమస్యలపై అక్కడ చర్చించి, భవిష్యత్తు పోరాట కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు జి.శ్రీనివాసరావు, గాడి అప్పారావు, పి.రామ్మోహన్‌, జగన్‌ మోహన్‌, ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి బుద్దరాజు రాంబాబు, కౌలురైతుల సంఘం జిల్లా నాయకులు రాకోటి రాములు, సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, తదితరులు పాల్గొన్నారు.