దెందులూరు నియోజకర్గ సమస్యలపై ఎంఎల్‌ఎ విన్నపాలు
తన ప్రసంగంలో కనీసం ప్రస్తావించని సిఎం జగన్
గతంలో ఇచ్చిన హామీ కొల్లేరు రీసర్వేపైనా మౌనమే
భారీగా తరలింపుతో మహిళలకు తీవ్ర ఇబ్బందులు
ఎంఎల్‌సి, ప్రజాసంఘాల నేతల నిర్బంధం
ప్రతిపక్షాలపై విమర్శలు లేకుండా సాగిన ప్రసంగంపై సర్వత్రా చర్చ
బటన్ నొక్కి మూడో విడత ఆసరా నిధులు విడుదల
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి/దెందులూరు
దెందులూరు నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యలపై ఎంఎల్‌ఎ అబ్బాయిచౌదరి చేసిన విన్నపాలపై ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి భరోసా దొరకకపోవడంతో నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. డ్వాక్రా సంఘాలకు మూడో విడత ఆసరా నిధులు విడుదల కార్యక్రమం దెందులూరులో శనివారం అట్టహాసంగా సాగింది. డ్వాక్రా మహిళలను స్కూల్, ఆర్‌టిసి బస్సుల్లో పెద్దఎత్తున సభకు తరలించారు. ఉదయం 10.37 గంటలకు సిఎం జగన్ దెందులూరులో సభావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. మంత్రులు, అధికారులు పెద్దఎత్తున సిఎంకు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి సభాస్థలికి చేరుకున్న జగన్ అక్కడ వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించి మహిళలతో మాట్లాడారు. అనంతరం సభా వేదికపైకి చేరుకుని వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, జ్యోతిప్రజల్వన చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ మాట్లాడుతూ మూడో విడత ఆసరా నిధుల విడుదలకు సంబంధించి వివరాలను తెలిపారు. సామాన్యుని అభివృద్ధి లక్ష్యంగా, మహిళలకు ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందన్నారు. సిఎం వచ్చిన ప్రతిసారీ జిల్లాలో వర్షాలు పుష్కలంగా పడుతున్నాయని వ్యాఖ్యానించారు.
సిఎం దృష్టికి నియోజకవర్గ సమస్యలు
దెందులూరు ఎంఎల్‌ఎ అబ్బాయిచౌదరి మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించి శంకుస్థాపన చేసిన పనులతోపాటు దీర్ఘకాలం వెంటాడుతున్న పలు సమస్యలను సిఎం ముందు ప్రస్తావించారు. ఎస్‌సి, బిసి ఏరియాలో 25 కిలోమీటర్ల మేర రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ దెబ్బతిన్నాయని, వాటికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎస్‌సి ఏరియాలో శ్మశాన వాటికలను నాడు-నేడులో అభివృద్ధి చేయాలని తెలిపారు. నియోజకవర్గంలోని వీరంపాలెం, పాత కొత్తముప్పరు వంతెనల నిర్మాణం చేపట్టాలని కోరారు. నియోజకవర్గంలో పామాయిల్, కోకో, ఆక్వా వంటి పంటలు పండుతున్నాయని ఎపిఐఐసి ల్యాండ్ అందుబాటులో ఉందని, ఎంఎస్‌ఎంఇ పార్క్ ఏర్పాటు చేయాలని, పెదవేగిలో ప్రస్తుతమున్న పామాయిల్ ఫ్యాక్టరీ పాతబడిందని, కొత్తది నిర్మించాలని కోరారు. గుడివాకలంక, కొవ్వలి, పెదవేగిలో జూనియర్ కాలేజీలు, దెందులూరులో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని అడిగారు. ఏలూరు కెనాల్ ఆధునికీకరిస్తే నియోజకవర్గ రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు. పోణంగి పుంతకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని, కొల్లేరు భూములకు సంబంధించి రీసర్వే చేయాలని విన్నవించారు. సత్యవోలు, కన్నాపురం, కొవ్వలిలో 33/11 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరు చేయాలని కోరారు. పత్తికోళ్లలంకలో ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు వచ్చే ఎన్నికల్లో దెందులూరులో వైసిపి జెండా ఎగురవేస్తామని ఎంఎల్‌ఎ తన ప్రసంగంలో ప్రకటించారు. ఎంఎల్‌ఎ ప్రస్తావించిన ఏఒక్క అంశం, విన్నపంపై సిఎం తన ప్రసంగంలో స్పందించలేదు. దీంతో సభకు విచ్చేసిన దెందులూరు నియోజకవర్గ ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. 2002 మే నెలలో గణపవరం సభలో కొల్లేరు రీసర్వే చేయిస్తానని సిఎం హామీ ఇచ్చారు. అదే విషయాన్ని దెందులూరు ఎంఎల్‌ఎ మరోసారి ప్రస్తావించినా సిఎం నుంచి స్పందన లేకపోవడం కొల్లేరు ప్రజలను తీవ్ర నిరాశపర్చింది.
సిఎం ప్రసంగం 27 నిముషాలే
12.05 గంటలకు ప్రారంభమైన సిఎం జగన్ ప్రసంగం 12.32 గంటలకు ముగిసింది. కేవలం 27 నిముషాలు మాత్రమే ఆయన మాట్లాడారు. ప్రతి సభలోనూ టిడిపి, జనసేనపై తీవ్ర విమర్శలు గుప్పించే సిఎం జగన్ దెందులూరు సభలో మాత్రం ఎటువంటి రాజకీయ విమర్శలూ చేయకుండానే ముగించేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఎంఎల్‌సి ఎన్నికలపై సిఎం మాట్లాడతారని అంతా భావించారు. అటువంటి ప్రస్తావనే ఏమీ లేకుండానే సభ ముగిసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, బి.ముత్యంనాయుడు, రోజా, పినిపే విశ్వరూప్, ఎంపీ కోటగిరి శ్రీధర్, పలువురు ఎంఎల్‌ఎలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నిర్బంధాలు
సిఎం పర్యటన నేపథ్యంలో అరెస్టులు, నిర్బంధాలు కొనసాగాయి. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్ సాబ్జీకి సిఎం పర్యటనకు అధికారులు ఆహ్వానం సైతం పలికారు. ప్రొటోకాల్ జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. అయితే సిఎం పర్యటనకు ఆయన వెళ్లకుండా ఇంటి ముందు పోలీసులు పహారా కాసి గృహ నిర్బంధం చేసిన పరిస్థితి నెలకొంది. ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ను ఆఫీసులో నిర్బంధించగా జిల్లా అధ్యక్షులు నరసింహాను నూజివీడు పోలీస్ స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. సిఐటియు నిడమర్రు మండల నాయకులు రమణను పోలీసులు నిర్బంధించారు. సభాస్థలి సామర్థానికన్నా అత్యధికంగా మహిళలను తరలించడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
దెందులూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి రూ.200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పెదవేగి మండలంలో రూ.68.85 కోట్లతో నిర్మించనున్న జగన్నాధపురం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. పెదవేగి మండలంలో 42 గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.61.60 కోట్లతో నిర్మించనున్న సిడబ్ల్యూఎస్ స్కీముకు శంకుస్థాపన చేశారు. ముసునూరు మండలం బలివే వద్ద రూ.18.33 కోట్లతో నిర్మించనున్న డబుల్‌లైన్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. దెందులూరు మండలం విజయరాయి గ్రామంలో రూ.రెండు కోట్లతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. దెందులూరులో రూ.2.78 కోట్లతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్యకేంద్రాన్ని ప్రారంభించారు. దెందులూరు నియోజకవర్గంలో బిటి రహదారుల పున:నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.










