ప్రజాశక్తి-విశాఖపట్నం : వినియోగంలో లేని కేబుల్ వైర్లు, ఎలక్ట్రికల్ పోల్స్ తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను జివిఎంసి కమిషనర్ పి.రాజాబాబు ఆదేశించారు. మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఎండాడ జంక్షన్ నుంచి ఐటి సెజ్ వరకు అధికారులతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జి-20 సదస్సుకు దేశ విదేశాల నుంచి అతిథులు వస్తున్నందున వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సుందర నగరంగా తీర్చిదిద్దాలని అందుకు రోడ్డు, జీబ్రా క్రాసింగ్ లైన్స్, పారిశుధ్యం, విద్యుత్ అలంకరణ, పచ్చదనం, ఫుట్ పాత్‌ల నిర్మాణం లాంటి సుందరీకరణ పనులు నాణ్యతతో పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రకటన బోర్డులు సక్రమంగా కట్టాలని, ఎండాడ చెరువుకు మరమ్మత్తులు చేపట్టి ఫుట్ పాత్ రెండు వైపులా మరమ్మత్తులు, పెయింటింగ్ వేయించాలని, భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎండాడ పరిసర ప్రాంతాలలో పారిశుధ్యం సరిగా నిర్వహించక పోవడంపై శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే శుభ్రం చేసి డస్ట్‌బిన్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఐటి సెజ్ బిల్డింగ్ నుంచి భీమిలి బీచ్ కలిసే రోడ్డు పాడైనందున వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ డాక్టర్ వి.సన్యాసిరావు, పట్టణ ప్రణాళికాధికారి బి.సురేష్‌కుమార్, హార్టికల్చర్ డిడి ఎం.దామోదరరావు, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, పర్యవేక్షక ఇంజినీర్ శ్యాంసన్‌రాజు, ఎఎంఒహెచ్ డాక్టర్ ఎన్.కిషోర్, డిసిపి పద్మజ, ఎసిపి రఘునాధరావు, డిఇ వంశీ, తదితర అధికారులు పాల్గొన్నారు.










