ప్రజాశక్తి-అనకాపల్లి
వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలని వినియోగదారుల కమిషన్ చైర్‌పర్సన్ తనూజ రెడ్డి అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలందరూ వినియోగదారులేనని, తమ హక్కులకు భంగం కలిగినప్పుడు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాలని సూచించారు. ఆన్‌లైన్‌లో కొన్న వస్తువులకు కూడా ఈ చట్టం వర్తిస్తుందన్నారు. ప్రతి కొనుగోలుకు బిల్లు విధిగా తీసుకోవాలని, గ్యారంటీ, వారంటీ, ఎక్స్‌పైర్ తేదీ చూసి కొనుగోలు చేయాలని సూచించారు. 50 లక్షల ఖరీదు వరకు ఉన్న వస్తువులపై హక్కులు వర్తిస్తాయన్నారు. వస్తువు నాణ్యతలో లోపాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ వినియోగదారులు రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు చేసేందుకు 1915, జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేసేందుకు 1967 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఇన్‌ఛార్జి డిఎస్‌ఓ కళ్యాణి, ఔషధ నియంత్రణ ఏడి అభిప్రియ, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, అడిషనల్ డిఎంహెచ్‌ఓ శారద బాయి వినియోగదారుల హక్కులను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఓ నందకిషోర్, డీటీలు అప్పలనాయుడు, లీల, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు జగప్పారావు, కే జగన్నాథరావు, చౌక డిపోల డీలర్ల సంఘం అధ్యక్షులు శేషుబాబు, జిల్లా వినియోగదారుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.










