పార్వతీపురంరూరల్/పాలకొండ/పాలకొండరూరల్: సామాన్యుల నెత్తిపై విద్యుత్ బిల్లుల బాంబు రెండు నెలల నుంచి పేలుతుంది. విద్యుత్ బాదుడికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఫ్యాన్లు, ఎసిలు మాట పక్కనపెడితే పూర్తిగా ఇళ్లల్లో లైట్లు వేసుకోడానికి భయపడుతున్నారు. సామాన్యులకు కూడా వేలల్లో బిల్లులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. కార్మికులు రోజంతా కష్టపడి కూలిడబ్బులు తెచ్చుకుని జీవిస్తున్న వారికి గత రెండు నెలల నుంచి వేలాది రూపాయలు విద్యుత్ బిల్లులు రావడంతో ఎలా చెల్లించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కొంతమంది విద్యుత్ బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతూ అప్పులపాలవుతున్నారు. ఏప్రిల్, జూన్ నెలల్లో వచ్చిన బిల్లులు చూస్తే ప్రజలకు షాక్ కొడుతుంది. వాడిన యూనిట్లు తక్కువైనప్పటికీ బిల్లులు మాత్రం తడిసిమోపెడవుతుంది. విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి బిల్లులు ఎక్కువ వచ్చాయని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా తామేమి చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ప్రజలకు తెలియకుండా ఇలా భారాలు వేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పేదలకు వేల కోట్లరూపాయలు సంక్షేమ పథకాల రూపంలో ఇస్తున్నామని గొప్పలు చెప్పకుంటున్న పాలకులు ఇలా పరోక్షంగా వివిధ రూపాల్లో ఛార్జీలు వేసి తిరిగి తీసుకుంటు న్నారని విమర్శిస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ 9సార్లు పెంచిన విద్యుత్ చార్జీలు పెంచింది. దీంతో రోజూ వారీ పనులు చేసుకుంటున్న జెరాక్స్ సెంటర్, బార్బర్‌షాపులు, కార్పంటరీ, వాషింగ్ పాయింట్, వెల్డింగ్‌వర్క్సు, చిన్నహౌటళ్లు, జ్యూస్‌పాయింట్, వాహనాలకు పెయింటింగ్ వర్కర్స్ ఒకటేమిటి విద్యుత్‌పై ఆధారపడి తమ దినసరి వ్యాపారం నడుపుకుంటున్న స్వల్ప ఆదాయ వర్గాలు కరెంట్ బిల్లులు అమాంతంగా పెరిగిపోవడంతో ఘోళ్లుమంటున్నారు. పట్టణంలోని ఎంపిడిఒ కార్యాలయ జంక్షన్‌లో రామారావు జెరాక్స్ షాపు నిర్వహిస్తున్నాడు. ఆయనకు ప్రతినెలా సగటున రూ.750 నుంచి రూ.వెయ్యి వరకూ కరెంట్ బిల్లు చెల్లిస్తుండగా, ఇటీవల విద్యుత్‌శాఖ సర్ధుబాటు ఛార్జీలు, ఛార్జీల పెంపుతో ఒక్కసారిగా రూ.1500 బిల్లు రావడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో ఉపాధి కోసం జిరాక్స్ షాపుపెట్టుకుంటూ జీవనం సాగిస్తుండగా, ఇలా ఛార్జీల పేరిట తమ బతుకులపై దెబ్బకొట్టడం ప్రభుత్వానికి ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీనికితోడు నిత్యావసరాలు, ఇంటిఅద్దెలు, స్కూల్‌ఫీజులు, మందులు ధరలు వంటివి కూడా పెరగడంతో పేదలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేదలు, దిగువ తరగతి వ్యాపారస్తుల బాధలను గమనించి తమకు జీవనాధరామైన విద్యుత్తుపై టారీఫ్‌లు తగ్గించి తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు.
కరెంట్ ఛార్జీల ప్రభావంతో ఆదాయానికి గండి
ఏ పనిచేయా లన్నా కరెంటు ఉంటేగానీ గడవని పరిస్ధితి. పెరిగిన కరెంటు ఛార్జీల వల్ల, అంతంత మాత్రంగా ఉన్న అత్తెసరు ఆదాయాల్లో ఎప్పటికప్పుడు పెరుగుతున్న విద్యుత్ బిల్లులు చెల్తిస్తూ కుటుంబం నెట్టుకురావడం కష్టంగా ఉంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుతో పాటు, కరెంట్ సబ్సీడీలు అందజేసి పేదలను ఆదుకోవాలి.
భాస్కర్‌రావు,
కార్పెంటర్, బైపాస్‌కాలనీ.
భారీగా విద్యుత్ బిల్లు వచ్చింది
తనకు ఉచిత విద్యుత్ సౌకర్యం ఉంది. 100 యూనిట్లులోపు విద్యుత్ వాడితే ఒక్కరూపాయి కూడా బిల్లు చెల్లించక్కర్లేదు. ఇంతవరకు మే నెల కూడా ఒక్క రూపాయి చెల్లించలేదు. అయితే ఈ నెల మాత్రం ఉచిత విద్యుత్‌కు యగనామాపెట్టారు. రూ.620 బిల్లు చెల్లించాలని రశీదు ఇచ్చారు.
కె.సత్యనారాయణ, పాలకొండ.
ఎప్పటికప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచుకుపోతే ఎలా?
ఒకవైపున ఐరన్ మెటిరియల్ రేట్లు పెరిగిపోవడం వల్ల పనికి తగిని గిట్టుబాటు లభించక ఇబ్బందులు పడుతుం టే ఆదుకోవాల్సిన ప్రభుత్వం సర్దుబాటు చార్జీల పేరుతో మరోవైపు కరెంట్ ఛార్జీలను అమాంతంగా పెంచింది. దీనివల్ల ఆదాయం చాలక అప్పులు చేసి జీవనం సాగించాల్సిన పరిస్ధితి.
శివ, హర్డ్‌వేర్ వెల్డింగ్ వర్కర్,
ఎల్‌ఎన్‌పురం పార్వతీపురం మండలం
వేలల్లోనే బిల్లు చెల్లించాల్సి వస్తుంది
విద్యుత్ బిల్లులు వేలల్లోనే చెల్లించాల్సి వస్తుంది. విద్యుత్ వాడకం తక్కు వైనప్పటికీ బిల్లులు మాత్రం ఎక్కువగా వస్తున్నాయి. గతంలో ఇదే నెలల్లో మాకు రూ.2వేలు బిల్లు రాగా ఈ ఏడాది ఈనెల రూ.3,983 బిల్లు వచ్చింది. ఇంత భారీ స్థాయిలో బిల్లులు రావడం అర్థం కావడం లేదు.
ఎస్.శారద, పాలకొండ.
బతుకు భారం
కరోనా అనంతరం ఆదాయాలు తగ్గి ఇబ్బందుల్లో ఉన్న పరిస్ధితుల్లో కరెంటు చార్జీల పెంపు మరింతగా కృంగదీస్తుంది. బార్బర్‌షాపు తెరిచిన దగ్గర నుండి మూసే వరకూ కరెటుతోనే సంబంధం, ఛార్జీలు పెరుతున్నాయంటే ఆదాయం తగ్గిపోతుందనే అర్ధం. విద్యుత్ ఛార్జీలకు అనుగుణంగా వినియోగదారుల పెరగరు. కావున పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించి, బిల్లుల నుండి ఊరట కల్పించాలి.
మురళీ, బార్బర్‌షాపు నిర్వాహకుడు, వెంకంపేట.










