Sep 07,2023 21:42

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : వినియోగదారులకు, రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక పోతులనాగేపల్లి గన్న లేఅవుట్ల వద్ద రూ.2.50కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యుత్‌ సబ్‌ స్టేషన్లో నూతనంగా అమర్చిన పరికరాలను, సప్లై చానల్ను పరిశీలించి ప్రజలకు అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోతులనాగేపల్లి వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న జగనన్న కాలనీలలో 6,700కు పైగా ఇళ్లను నిర్మించడం జరుగుతోందన్నారు. వీరందరికి విద్యుత్‌ సరఫరాలో ఏ ఇబ్బంది. లేకుండా ఉండేందుకు 33/11 కె.వి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను రూ.2.50 కోట్ల వ్యయంతో ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సబ్‌స్టేషన్‌ ద్వారా జగనన్న కాలనీలకే కాకుండా రూరల్‌ పరిధిలోని పోతుల నాగేపల్లి, తుంపర్తి, మోటును సీసీకొత్తకోట తదితర ప్రాంతాలలోని రైతాంగానికి నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామన్నారు. గతంలో ఈ ప్రాంతాలకు ఎర్రగుంట విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా అవుతుండటంతో లోడ్‌ ఎక్కువై రైతులు, ప్రజలు ఇబ్బందులు పడేవారన్నారు. ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం చూపించడానికే సబ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు వీలుగా నియోజకవర్గంలో కొత్తగా 33/11కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను గొట్లూరు, బత్తలపల్లి మండలం ఆప్రాచెరువు, ముదిగుబ్బ మండలం దొరిగిల్లు ప్రాంతాలలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాచర్ల లక్ష్మి, వైస్‌ చైర్మన్లు వేముల జయరామిరెడ్డి, షంషాద్‌ బేగం, ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఇ సురేంద్ర, ఈఈ రమేష్‌, డీఈఈ కిరణ్‌ కుమార్‌, డీఈఈ కనక్షన్‌ శ్రీకాంత్‌రెడ్డి, రూరల్‌ ఏఈ జానకిరామయ్య, ఏఈలు కొండారెడ్డి, నాగభూషణ, నజీరుద్దీన్‌తో పాటు పట్టణ సచివాలయాల కన్వీనర్లు చందమూరి నారాయణరెడ్డి, మానపల్లి సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.