Aug 13,2023 20:56

ఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ ఎం.లక్ష్మణరావు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లాలో వినియోగదారులకు మెరుగైన విద్యుత్తు సేవలు అందించడమే లక్ష్యమని ఎపిఇపిడిసిఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎం.లక్ష్మణరావు తెలిపారు. విద్యుత్తు కోతలు లేకుండా సరఫరా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈవారం తనను కలిసిన 'ప్రజాశక్తి'కి ఆయన ముఖాముఖి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు...
కొద్దిరోజులుగా విద్యుత్తు కోతలు పెరిగాయి. వాటి నివారణకు తీసుకున్న చర్యలు ఏమిటి?.
జిల్లాలో కొద్ది రోజులుగా అక్కడక్కడ ఇఎల్‌ఆర్‌ పేరిట విద్యుత్తు కోతలు విధించడం వాస్తవం. పవన విద్యుత్తు సరఫరా తగ్గడం వల్ల అంతరాయం ఏర్పడింది. గృహాలకు, కమర్షియల్‌ సంస్థలకు విద్యుత్తు కోతలు లేకుండా చూడాలని, పరిశ్రమలు పని గంటలను తగ్గించుకొనే విధంగా ప్రభుత్వం ఆదేశించింది. గృహ వినియోగదారులకు విద్యుత్తు కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
జగనన్న కాలనీల్లో విద్యుత్తు సరఫరాకు తీసుకున్న చర్యలు ఏమిటి?
జిల్లాలోని జగనన్న కాలనీల్లో ఇప్పటివరకు 30,365 ఇళ్లకు విద్యుత్తు సరఫరా ఇచ్చాం. జగనన్న కాలనీలకు విద్యుత్తు సరఫరా కోసం రామన్నదొరవలస, గుమడాం, గుంకలాం ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నాం. ఉమ్మడి జిల్లాల్లో జగనన్న కాలనీల్లో విద్యుత్తు సౌకర్యం కల్పించడం కోసం ఇప్పటివరకు రూ.38.83 కోట్లు ఖర్చు చేశాం.
జిల్లాల్లో వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు సరఫరా ఎలా ఉంది? ఈ ఏడాది ఎంతమంది రైతులకు కొత్త సర్వీసులిచ్చారు?.
జిల్లాలో రైతులకు పంటలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటలు వరకు 9 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. అక్కడక్కడ వాతావరణ పరిస్థితుల కారణంగా అంతరాయం ఏర్పడితే రైతులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో గత నాలుగు నెలల కాలంలో కొత్తగా 1334 సర్వీసులు రైతులకు ఇచ్చాం. జిల్లాలో 44,187 పంపు సీట్లకు విద్యుత్తు సరఫరా చేస్తున్నాం.
జిల్లాలో మెరుగైన విద్యుత్తు సరఫరా కోసం తీసుకుంటున్న చర్యలు ఏమిటి?.
జిల్లాల్లో 24 గంటల విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చేయాలనే ఉద్దేశంతో కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్‌డిఎస్‌ఎస్‌ పథకం కింద ప్రతిపాదనలు కోరింది. దీనిపై సర్వే చేపట్టి, ఏడాదిలోగా పూర్తి నివేదిక, ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలి.
విద్యుత్తు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి?.
జిల్లాలో ఎటువంటి ప్రమాదం జరగకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజల సహకారం ద్వారానే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది. విద్యుత్తు లైన్లు, స్థంభాలు, సరఫరాలో ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే 1912 నంబరుకు ఫోన్‌ చేయాలి. అందుబాటులో సిబ్బందికీ తెలియజేయొచ్చు. ఇటీవల జిల్లాలో జరిగిన ప్రమాదాలు అవగాహన రాహిత్యం వల్ల సంభవించాయి. అలాంటి వాటికి తావివ్వకుండా ప్రజలు టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించుకోవాలి. క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతోపాటు వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నాం.
శాఖాపరమైన పని తీరు మెరుగుదల కోసం తీసుకుంటున్న చర్యలు ఏమిటి?.
పనిలో మెరుగుదల కోసం శాఖాపరంగా కొన్ని చర్యలను ఉన్నతాధికారులు తీసుకున్నారు. జిల్లాకు మరొక కొత్త డివిజన్‌ ఏర్పాటు చేశారు. విజయనగరం రూరల్‌ డివిజన్‌ కొత్తగా అందుబాటులోకి వచ్చింది. కొత్తగా మెంటాడ, వుడా సెక్షన్లు ఏర్పాటు చేశారు.
లో ఓల్టేజ్‌ సమస్య పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
జిల్లాల్లో లోఓల్టేజ్‌ సమస్య చాలా తక్కువగా ఉంది. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కూడా లోఓల్టేజ్‌ సమస్యపై పెద్దగా ఫిర్యాదులు రావడం లేదు. మరోవైపు జిల్లాలో విద్యుత్తు పంపిణీకి ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా పంపిణీ నెట్‌వర్క్‌, విద్యుత్‌ లైన్లు, స్థంభాలు, ఇంటర్‌ లింక్‌ వంటి వాటికి ప్రతిపాదనలు నెల రోజుల్లో సిద్ధం చేసి పంపిస్తాం.
వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్తు పునరుద్ధరణకు ముందస్తుగా ఎలా సన్నద్ధమయ్యారు?.
వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్తు ప్రమాదాలు జరిగిన వెంటనే సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతోపాటు అందుబాటులో 150 వరకు విద్యుత్‌ స్తంభాలు, వైర్లు, పునరుద్ధరణకు కావాల్సిన సామగ్రిని సిద్దంగా ఉంచాం. వర్షాకాలంలో ప్రజలకు ఏర్పడిన విద్యుత్తు అంతరాయాన్ని వెంటనే సరిచేసేలా ఉద్యోగులను, అందుకు తగిన మెటీరియల్‌ను సిద్ధంగా ఉంచాం.