ప్రజాశక్తి-వన్‌టౌన్: వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు అనేక చట్టాలు అందుబాటులో ఉన్నాయని అమరావతి లీగల్ అకాడమీ డైరెక్టర్ అవిర్నేని శ్రీనివాసశ్యామ్‌సుందర్ అన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల కన్స్యూమర్ క్లబ్ ఆధ్వర్యంలో 'వినియోగదారుల హక్కులు' అంశంపై సదస్సును ఆ కళాశాల సెమినార్ హాల్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యవక్తగా హాజరైన అవిర్నేని శ్రీనివాస శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ వినియోగదారులకు భారతదేశంలో అనేక చట్టాలు రక్షణగా ఉన్నాయన్నారు. అయితే వాటిపై సరైన అవగాహన లేకపోవటంతో వినియోగదారులు చాలా మంది మోసపోతున్నారని వివరించారు. కేవలం వస్తువుల కొనుగోలు మాత్రమే కాకుండా సేవల విషయంలోనూ అనేక చట్టాలు ఉన్నాయన్నారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కన్స్యూమర్ ఫోరమ్స్ పని చేస్తున్నాయన్నారు. ఆయా విలువలను బట్టి ఆయా స్థాయిల్లో వీటిపై చర్చ జరిగి వినియోగదారులకు న్యాయం జరిగే విధంగా ఫోరమ్‌లు కషి చేస్తాయన్నారు. ప్రధానంగా వీటిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. వెంకటేశ్వరరావు, వాణిజ్య శాఖాదిపతి డాక్టర్ ఆంజనేయశాస్త్రి, క్లబ్ కన్వీనర్ గోపాలకష్ణ పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.










