Aug 17,2023 21:01

సదస్సులో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు

పార్వతీపురం: వినియోగదారుల రక్షణ చట్టం, 2019 పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని, అందుకు గాను వారికి ఈ చట్టం గురించి తెలియజేయాలని జాయింటు కలెక్టరు ఆర్‌. గోవిందరావు తెలిపారు. గురువారం స్థానిక ఐటిడిఎ సామాజిక భవనంలో వినియోగదారు క్లబ్‌ ఇన్‌ఛార్జులుగా నియమితులైన ఉపాధ్యాయులు, రిసోర్స్‌పర్సన్లకు జిల్లా స్థాయి ఓరియంటేషన్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాయింటు కలెక్టరు మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం, 2019 పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో 8,9 తరగతి విద్యార్థుల కోసం ఒక వినియోగదారు క్లబ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుల హక్కులను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లేందుకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల శాఖ విస్తతమైన ప్రచారాన్ని ప్రారంభిస్తోందన్నారు. విద్యార్థి సంఘం భాగస్వామ్యం లేకుండా, వినియోగదారుల హక్కులను సమాజానికి తెలియజేయలేమని అందుకుగాను విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేసేందుకు వినియోగదారుల క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో 8, 9వ తరగతి విద్యార్థుల కోసం ఒక వినియోగదారు క్లబ్‌ను ప్రారంభించి అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికను అందజేయడమైందన్నారు. వినియోగదారులకు సంబంధించిన విషయాలపై సాంస్కతిక కార్యక్రమాల ప్రదర్శన, వ్యాసరచన, డ్రాయింగ్‌ పోటీలు, వినియోగదారుల సవాళ్లపై సర్వే నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. డిఇఒ ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ 9,9 తరగతి విద్యార్థుల కోసం ఒక వినియోగదారుల క్లబ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుల క్లబ్‌లకు ఇన్‌ఛార్జులుగా నియమించిన 189 మంది ఉపాధ్యాయులకు ఈ చట్టం పట్ల అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటుచేయడమైనదన్నారు.