Apr 17,2023 00:00

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో మొదటి దశ పనులు పూర్తికాకపోవడం వల్ల నడికుడి-శావల్యాపురం మార్గంలో రైళ్ల రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు. ట్రాక్‌ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. న్యూ పిడుగురాళ్లను జంక్షన్‌ ఏర్పాటు చేసినా ఇందుకు సంబంధించిన సాంకేతిక పనులు పూర్తికాకపోవడం, శావల్యాపురం వద్ద గుంటూరు, గుంతకల్లు మార్గానికి పూర్తి స్థాయిలో అనుసంధాన నిర్మాణ పనులు జరగకపోవడం వల్ల రైళ్ల రాకపోకలకు ఇంకా పచ్చజెండా ఊపలేదని రైల్వే వర్గాలు తెలిపాయి.
పనులు ప్రారంభించి ఆరేళ్లు గడిచినా నూతన రైల్వే లైను మొదటి దశ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ట్రాక్‌ నిర్మాణంతోపాటు విద్యుద్దీకరణ పనులు కూడా చేపట్టాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. 2022 డిసెంబరు నాటికి పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం మధ్య రైళ్ల రాకపోకలను ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ మార్గంలో ఏడాది క్రితమే ట్రయిల్‌ రన్‌ వేశారు. కానీ ఇంకా కొన్ని పనులు ఆగిపోవడం వల్ల హైదరాబాద్‌ రైల్వేలైను నుంచి నంధ్యాల లైనుకు అనుసంధానం జరగలేదు. ఈ ట్రాక్‌ నిర్మాణం మొత్తం పూర్తయితే హైదరాబాద్‌ నుంచి కూడా రైళ్లు నేరుగా తిరుపతికి వెళ్లే అవకాశం ఉంది.
2017లో నడికుడి-శ్రీకాళహస్తి మధ్య 308 కిలో మీటర్ల మేరకు ట్రాక్‌ నిర్మాణ పనులు చేపట్టారు. తొలిదశ పనులు పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు 47 కిలో మీటర్ల మేరకు ట్రాక్‌ నిర్మాణ పనులు చేపట్టారు. పిడుగురాళ్ల-రొంపిచర్ల మధ్య ఒక ఆర్‌యూబీ, మరో ఆర్‌వోబి పనులు పూర్తి అయ్యాయి. నకరికల్లు వద్ద కొండను తొలచి పనులు చేపట్టారు. బెల్లంకొండ బ్రాంచి కెనాల్‌, గుంటూరు బ్రాంచి కెనాల్‌పై వంతెనలు నిర్మించారు. పిడుగురాళ్ల-శావల్యాపురం మధ్య 47 కిలో మీటర్ల పరిధిలో నూతన రైల్వే స్టేషన్లు, ఫ్లాట్‌ ఫారాలు, క్యాబిన్లు నిర్మాణం కూడా పూర్తయ్యాయి. ఆయా ప్రాంతాల్లో సిగల్‌ వ్యవస్థ ఎలక్ట్రికల్‌ పనులు చేపట్టారు. పిడుగరాళ్ల నుంచి నెల్లూరు జిల్లా వెంకటగిరి వరకూ రైల్వే ట్రాక్‌ నిర్మాణం జరగాల్సి ఉంది. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గం నిర్మాణం కోసం రూ.3250 కోట్లు అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం కేంద్రం భరించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించింది.
పల్నాడు, గుంటూరు జిల్లాలో భూ సేకరణ సమస్య కూడా పరిష్కారమైంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో మెట్ట ప్రాంత వాసులకు ఇప్పటి వరకూ రైల్వే సౌకర్యం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 2017లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పనులు ప్రారంభం కాగా ఆరేళ్లుగా మొదటి దశ పనులు కూడా పూర్తి చేసి రైళ్లను నడపలేకపోయారు. కొన్ని సమయాల్లో హైదరాబాద్‌ నుంచి గూడ్సు రైళ్లు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లా పరిధిలో రెండో దశ పనులు జరుగుతున్నాయి. మొదటిదశలో గుంతకల్లు, గుంటూరుకు ట్రాక్‌కు అనుసంధానం చేయడం ద్వారా దక్షిణ, ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలకు రాకపోకలకు అవకాశం ఏర్పడనుంది.