Aug 31,2023 21:36

ప్రజాశక్తి - భీమవరం
వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. అన్ని శాఖల అనుమతులు ఒకే చోట పొందేందుకు ఆయా మున్సిపాల్టీల్లో సింగిల్‌ విండో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారుచేసిన వినాయక ప్రతిమలు పూర్తిగా నిషేధించడం జరిగిందని, నిబంధనలు మీరితే సంబంధిత వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో ఎపి పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక చతుర్థి జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సుప్రీంకోర్టు, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలకులోబడి విగ్రహాల తయారీ, నిమర్జనం కార్యక్రమాలు ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలు తయారీ, అమ్మకాలు నిషేధం అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా తయారు చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 100 విగ్రహాలు పైబడి తయారు చేసేవారు కచ్ఛితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకుని, ట్రేడ్‌ లైసెన్స్‌ పొందాలన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాల కారణంగా జలవనరులు, పర్యావరణం, జల వనరుల్లో ఉండే ప్రాణులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందన్నారు. మట్టి విగ్రహాలను మాత్రమే వాడాలన్నారు. గణేష్‌ ఉత్సవాల మండపాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. బాణాసంచా కాల్చడం, పెద్ద పెద్ద శబ్ధాలతో మైకులను ఏర్పాటు చేయడం వంటివి చేయకూడదన్నారు. వినోద కార్యక్రమాల్లో అశ్లీలత, డాన్సులు లేకుండా సాంప్రదాయబద్ధంగా ఉండాలన్నారు. విగ్రహాల తయారుచేసే ప్రదేశాలపై పోలీస్‌, రెవెన్యూ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు తనిఖీలు ఉంటాయన్నారు. మండపాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్‌ కమిషనర్లు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అనుమతులు ఇవ్వాలన్నారు. రహదారులకు అడ్డంగా ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాల ఏర్పాటు చేయకూడదన్నారు. నిమర్జనాల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. మున్సిపల్‌, పరిశ్రమలు శాఖలు పెద్ద ఎత్తున మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలన్నారు. నిమజ్జనాల రోజుల్లో వివిధ కూడళ్లలో మెడికల్‌ క్యాంపులు, అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని పంచాయతీల్లో, మున్సిపాల్టీలో పర్యావరణ విగ్రహాల తయారీ, వినియోగాలపై అధికారులతో సమావేశాలను ఏర్పాటుచేసి అవగాహన, చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ కె.కృష్ణవేణి, ఎపి పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కె.వెంకటేశ్వరరావు, డిపిఒ జివికె.మల్లికార్జునరావు, డిఇఒ ఆర్‌.వెంకటరమణ, డిఐఒ వి.ఆదిశేషు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శ్యామల పాల్గొన్నారు.